ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాబడి మీద ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. కేసీఆర్ యూజ్ లెస్ అని ఆయన ప్రభుత్వం హోప్లెస్ అని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరుద్యోగ మార్చ్ సభలో ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని స్పష్టంచేశారు. కేసీఆర్ కోసమే సచివాలయం కట్టు-కున్నారని, సచివాలయ వ్యయం రూ. 400 కోట్ల నుంచి రూ. 1600 కోట్లకు పెంచారని ఇందులో అవినీతి ఎంత అంటూ ప్రశ్నించారు. రూ. 1200 కోట్లు- ఎవరి జేబుల్లోకి వెళ్లాయని నిలదీశారు. మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ప్రజలు సముచితంగా ఆలోచించి ఓటేయాలని కోరారు.
సంగారెడ్డిలో కాషాయజెండా ఎగరడం ఖాయం: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంగారెడ్డిలో కాషాయజెండా ఎగరడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పష్టంచేశారు. నిరుద్యోగ మార్చ్‌తో సంగారెడ్డిలో బీజేపీ సత్తాచాటితే హరీశ్ రావు భయపడి అమెరికాకు పారిపోతే.. కేటీ-ఆర్ లండన్ పారిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని పర్మినెంట్ చేస్తానన్న కేసీఆర్.. ఇంత వరకు ఒక్కరిని కూడా పర్మినెంట్ చేయలేదన్నారు. ఉమ్మడి మెదక్‌లో ఎంత మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఎంత మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారో ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.