కర్రలతో దాడి, ఓటింగ్ మెషిన్లు ధ్వంసం
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని మూడు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకాలోని మసబినాల్ గ్రామంలో అధికారులు ఈవీఎంలను మారుస్తున్నారనే పుకార్లు రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు, వీవీప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్) యంత్రాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా పోలింగ్ అధికారుల వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
బెంగళూరులోని పద్మనాభనగర్ నియోజకవర్గంలోని పాపయ్య గార్డెన్‌లోని పోలింగ్ బూత్‌లో కొందరు యువకులు కర్రలతో తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓటు వేయడానికి క్యూలో నిలబడిన కొంతమంది మహిళలకు గాయాలైనట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు ఘటనలతో పాటు బళ్లారి జిల్లా సంజీవరాయలకోట్ వద్ద సైతం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు జోక్యంతో వివాదం సద్దుమణిగినట్టు సమాచారం.