హైదరాబాద్ ఉగ్ర కుట్రల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వచ్చి శిక్షణ తీసుకోవడమే కాకుండా.. యువతను టెర్రరిజం వైపు లాక్కేళ్లే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఉగ్రముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన ఐదుగురితో పాటు మరో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని భోపాల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 19 వరకు నిందితులను రిమాండ్ కు అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరు అడవుల్లో శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ కు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. డార్క్‌వెబ్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తూ పెద్ద నగరాలను టార్గెట్ చేస్తూ స్థిరపడ్డట్టు గుర్తించారు. హిందువులను ముస్లింలుగా మార్చి.. వారి ద్వారా పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు తెలిసింది.
మరోవైపు ఏటీఎస్ దాడుల్లో తప్పించుకున్న మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ లకు ప్లాన్ చేసిన ప్రధాన నిందితుడు మహ్మద్ సల్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు.మహ్మద్ సల్మాన్ దాదాపు 20ఏళ్లుగా జవహార్ నగర్ లో నివాసముంటున్నాడు. అందరిలో ఒకరిలా ఉంటూనే.. రహస్యంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడటం షాక్ కు గురిచేసింది. అత్యధిక జనాభా కలిగిన జవహర్ నగర్ ప్రాంతం.. ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డగా మారే అవకాశం ఉందని,అధికారులు ఈ ప్రాంతంపై నిఘా పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.