ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శల సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (CM KCR) నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (MP Uttamkumar Reddy) బహిరంగ లేఖ రాశారు. గత 13 రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారని.. వీరి సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటిపోయిందని తెలిపారు. వారి మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ 2022, ఏప్రిల్ 11న పూర్తైందన్నారు. రెగ్యులర్ చేయకపోగా, ప్రొబేషనరీ పీరియడ్‌ను మరో ఏడాది పెంచుతున్నట్లు అసెంబ్లీలో ప్రకటన చేసి, ఆ వెంటనే జూలై 17న జీవో నెంబర్ 26ను విడుదల చేశారన్నారు.
అయితే ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగాన్నారు. తక్షణమే వారికిచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా! అని ప్రశ్నించారు. ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక… వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు కూడా సిద్ధమవుతామని ఉత్తమ్ లేఖలో డిమాండ్ చేశారు.