తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పది ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ఎస్సెస్సీ బోర్డు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్షలకు 4.4 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.
మొత్తం 86.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత పొందారు. ఈ సారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా అత్యధికంగా 99 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా.. అత్యల్పంగా 59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈసారి 2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత సాధించగా.. 25 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ అవ్వని పరిస్థితి. పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు http://results.bse.telangana.gov.in, http://results. bsetelangana.org అనే వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.