కూతురి ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందన
సొంత కూతురు భవాని రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి మంగళవారం స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డ సంతకాన్ని ఫోర్జరీ చేయలేదని, బిడ్డ పేరిట ఉన్న ప్లాట్ ఆమె పేరుతోనే ఉందని యాదగిరి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కుటుంబ సమస్యలు సహజంగా ఉంటాయని, తన బిడ్డను ప్రత్యర్ధులు ఈ విధంగా తనపై ఉసిగొల్పుతున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా గిట్టనివారు, ప్రతిపక్షాలు తమ కుటుంబ సమస్యను వివాదంగా మార్చారని అన్నారు. చేర్యాలలో సర్వే నెం 1402లో 1200 గజాలు తన బిడ్డపై రిజిస్టర్ చేసి ఉందని, అందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదన్నారు. ఉప్పల్ పీఎస్ పరిధిలో తమ బిడ్డ పేరుపై 125 నుండి 150 గజాల వరకు స్థలం ఉందని, అందులో ఎలాంటి ఫోర్జరీ జరగలేదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.
‘ఇది కుటుంబ సమస్య. నేను ఏ తప్పు చేసినా ప్రజలు శిక్ష వేస్తారు. మా అధినేత, సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నంతవరకు నియోజకవర్గంలో ఉంటాను. నా రాజకీయ ప్రత్యర్ధులు ఎవరు అనేది మా అధినేతకు తెలుసు. వివాదం సృష్టించే వారి విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని యాదగిరి రెడ్డి పేర్కొన్నారు.