జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం గుట్టకింద గ్రామాలలో మావోయిస్టు లేఖల కలకలం సృష్టిస్తోంది. 14 మంది అధికార పార్టీ ఎంపీపీ, సర్పంచులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖలు విడుదల చేశారు. ప్రభుత్వ, అటవీ భూములు కబ్జా చేస్తున్నారని.. వారికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిక పంపించారు. మావోయిస్టు నాయకుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేష్ పేరిట లేఖలు పంపారు.కంకణాల రాజిరెడ్డికి జగిత్యాల డివిజన్ లో కొంతకాలం పనిచేసిన పరిచయాలు ఉన్నాయి.
రెండురోజుల క్రితం రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారి,మావోయిస్టు కదలికపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీలను ఆదేశించిన విషయం విధితమే.పోలీసులు, నిఘావర్గాలు లేఖల అంశంపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇటు రామగుండంలోనూ ఇలాంటి లేక ఒకటి కలకలం రేపుతోంది.నరసింహులపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి గతంలో ఎన్కౌంటర్ లో మృతి చెందిన పద్మక్క రూ.15 లక్షలు ఇచ్చినట్టుగా మావోయిస్టు పార్టీ కార్యదర్శి మల్లికార్జున పంపిన లేఖగా తెలిసింది.
అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లాతో పాటు పెద్దపెల్లి జిల్లాలో కూడా ఇలాంటి లేఖలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలు నిజంగానే మావోయిస్టు పార్టీ నేతలు పంపారా, లేక ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.