అధికారుల సమక్షంలోనే రైస్ మిల్ లో పనిచేస్తున్న వారిపై చేయిచేసుకున్నారు ఎమ్మెల్యే. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పెద్దమల్లారెడ్డిలోని పూర్ణిమ రైస్ మిల్ లో చోటుచేసుకుంది.
రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ రైస్ మిల్లర్స్ తో సమావేశం ఏర్పాటు చేశారు. తడిసిన ధాన్యాన్నికూడా కొనాలని మిల్లర్లు కోరడంతో రైతుల బాధను చూడలేక కలెక్టర్ సరేనన్నారు. ఇచ్చిన మాట మేరకు గ్రామంలో నిన్నటి నుంచి రైస్ మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని తీసుకుంటున్నారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రైస్ మిల్ కు వెళ్లి ధాన్యం కొనుగోళ్లపై ఆరాతీశారు. సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అసహనానికి లోనైన ఎమ్మెల్యే గంప గోవర్ధన్ .. అక్కడున్నవారిపై చేయి చేసుకున్నారు. దాంతో మిల్లర్లు ఆవేదన చెందారు.
ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ లో మిల్లర్లకు కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని.. సమస్యలు సరిదిద్దుకోవడానికి కొంతసమయం పడుతుందని, దానికి చేయి చేసుకోవడం పరిష్కారం కాదని.. సంయమనం పాటించాలని మిల్లర్లు అంటున్నారు. మిల్లర్లకు,రైతులకు..అధికారులు, రాజకీయ నాయకులు వారధిగా ఉండాలి కానీ అధికారుల సమక్షంలో ఎమ్మెల్యే చేయి చేసుకోవడం బాధాకరమని తెలిపారు. వెంటనే ఎమ్మెల్యే బేషరతుగా రైస్ మిల్లర్లకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు.