AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఘనంగా బ్రిటన్ రాజు ఛార్లెస్ lll పట్టాభిషేకం

బ్రిటన్ రాజుగా ఛార్లెస్ lll పట్టాభిషిక్తులయ్యారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. 1953 లో క్వీన్ ఎలిజబెత్ పట్టాభిషేకం తరువాత దాదాపు 70 ఏళ్లకు ఛార్లెస్ lll రాజుగా ఆసీనులయ్యారు. రెండు వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబీకులు, విదేశి ప్రముఖుల సమక్షంలో కింగ్ ఛార్లెస్ lll సింహాసనాన్ని అధిష్టించగా.. ఆయన సతీమణి కెమిల్లాకు రాణిగా కిరీటం అలకరించారు.

తొలుత ఛార్లెస్ lll దంపతులు డైమండ్‌ జూబ్లీ స్టేట్‌ కోచ్‌ బగ్గీలో బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబేకు చేరుకున్నారు.అక్కడ కాంటెర్‌బరీ ఆర్చ్ బిషప్‌ తొలుత కింగ్‌ ఛార్లెస్‌ను పరిచయం చేశారు. అన్నివైపులా కన్పించేలా నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరుగుతుంటే ఈ పరిచయం జరిగింది. అనంతరం చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్‌ ప్రమాణం చేశారు. తర్వాత చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్‌ రెండో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక సభికులు గాడ్‌ సేవ్‌ కింగ్‌ అంటూ ఆలపించారు.

ప్రమాణం ముగియగానే సభలో ప్రార్థనలు చేశారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ బైబిల్‌లోని కొన్ని పంక్తులను పఠించారు. ప్రమాణం, ప్రార్థనల తర్వాత 1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ చేయించిన సింహాసనాన్ని కింగ్ ఛార్లెస్‌-3 అధిష్ఠించారు. తరువాత నూనెతో అభిషేకం చేశారు. అభిషేకం పూర్తయ్యాక మహారాజ గౌన్‌ ధరించి సింహాసనంపై కూర్చున్నారు. ఆ తర్వాత శిలువతో ఉన్న బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్ బిషప్‌ కింగ్ కు అందించారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగిన అనంతరం కిరీటధారణ చేశారు. ఆ తర్వాత అందరూ ‘గాడ్‌ సేవ్‌ కింగ్‌’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రాజు ఛార్లెస్‌ పట్టాభిషేక కుర్చీలోంచి లేచి.. రాజ ఖడ్గాన్ని చేతిలో పట్టుకుని ప్రత్యేకంగా చేయించిన సింహాసనంపై ఆసీనులయ్యారు.

కాగా క్వీన్ ఎలిజబెత్ II 26 ఏళ్ల వయసులో .. ఆమె తండ్రి కింగ్ జార్జ్ VI 1952లో మరణించాక రాణిగా వారసత్వాన్ని కొనసాగించారు. ఆమె గతేడాది కన్నుమూశారు. ఆ తర్వాత ఆమె పెద్ద కొడుకైన ఛార్లెస్ ఫిలిప్‌ను కింగ్‌గా ప్రకటించింది రాయల్ ఫ్యామిలీ. ఇప్పుడు అధికారికంగా పట్టాభిషేకం నిర్వహించింది.

 

 

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10