మరుభూమిని తలపిస్తున్న టర్కీ, సిరియాలు
ప్రకృతి విలయతాండవానికి టర్కీ, సిరియాలు విలవిల్లాడాయి. ఎటుచూసినా కుప్పకూలిన భవనాలు, శిథిలాలే దర్శనమిస్తున్నాయి. శిథిలాల నుంచి గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. సోమవారం వరుసగా సంభవించిన శక్తిమంతమైన భూకంపాలతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంప తీవ్రతకు అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. టర్కీలోని హతయ్ ప్రావిన్సుల్లోని ఎయిర్‌పోర్టురన్‌వే భూకంపం ధాటికి రెండు ముక్కలై ఎందుకూ పనికిరాకుండా పోయింది.
హతయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులోని ఒకే ఒక్క రన్‌వే ఉండగా.. అది పూర్తిగా ధ్వంసమైంది. భారీగా పగుళ్లు ఏర్పడి రెండుగా చీలిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉండగా.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. కొన్నిచోట్ల శిథిలాల కింద నుంచి ప్రజలు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఈ విపత్తు నుంచి బయటపడిన వారు బండరాళ్ల కింద చిక్కుకున్న తమ వారి కోసం రోదించడం యావత్ ప్రపంచాన్ని కలచివేస్తుంది. భూప్రళయంతో అతాలకుతలమైన టర్కీ, సిరియాలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్‌తో సహా పలు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి.