దసరా అంటే మైసూరు. మైసూరు అంటేనే దసరా. శరన్నవరాత్రులతో మైసూరు మెరిసిపోతోంది. నాదహబ్బ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక అందాలతో శోభిల్లుతోంది. విద్యుత్ దీప కాంతులతో ..విశేష పుష్పాలంకరణలతో ..స్వాగత ద్వారాలతో నగరం రమణీయతను సంతరించుకుంది. నగరంలో ఏ ప్రాంతాన్ని చూసినా భక్తి భావం పరవళ్ళు తొక్కుతోంది. దసరా అంటేనే సందడిగా.. సరదాగా సాగే అతి పెద్ద పెడుగ. అందులోనూ కర్నాటకలో దసరా అంటే ఠక్కున గుర్తొచ్చేది మైసూరే.ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఇక్కడ జరిగే ఉత్సవాలను తిలకించేందుకు వస్తూ ఉంటారు. దేశ విదేశాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు క్యూకడుతుంటారు. పది పదిహేను రోజుల పాటు నగరం మొత్తం ఓ పెళ్ళిల్లులా కళకళ లాడుతోంది. సంస్కృతి, సంప్రదాయాలు జాలు వారుతున్నాయి. శాస్త్రీయ సంగీత తరంగాలు ప్రవహిస్తున్నాయి. మంగళ ధ్వనులతో మిళతమై వేదాలు కర్ణపేయంగా ధ్వనిస్తున్నాయి. భక్తులతో కిటకిటలాడుతూ ఉంది. ఎక్కడెక్కడ నుండో పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. శక్తి స్వరూపిణి చాముండీ అమ్మ వారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఇక శరన్నవరాత్రుల సందర్భంగా చారిత్రిక ప్రాసాదాలన్నీ కళకళలాడుతున్నాయి.
శక్తిపీఠాలలో నాలుగవది మైసూరు. ఇక్కడ కొలువుదీరిన అమ్మ వారు చాముండేశ్వరీ దేవి. ఆ శక్తి స్వరూపిణి కొలువైన మైసూరును క్రౌంచ పట్టణం అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ నిర్వహించే పండగల్లో అత్యంత ప్రధానమైనది.. విశేషమైనది .. దసరా. దాదాపు 410 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయంటే .. ఈ పండగకు ఇక్కడ ఉన్న ప్రాశస్త్యం ఏమిటో అర్ధం అవుతుంది. సువర్ణ మణిమయ కాంతులతో .. పట్టు పీతాంబరాలతో .. వరదాభయ హస్తాలతో భక్తులను కటాక్షిస్తున్న అమ్మ వారిని దర్శించుకుని భక్తులు పునీతులు అవుతున్నారు. రోజుకొక్క రూపంలో అమ్మ వారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. వేదమంత్రోచ్ఛారణలు.. మందళతూర్యారావాలు మిన్ను ముడుతుండగా.. మైసూరు నగరం భక్తిభావంతో ఉప్పొంగిపోతోంది. చోళులు, చాళుక్యులు, హొయసల, విజయనగర రాజుల పాలనా కాలంలో ఎంతగానో పురోభివృద్ధి సాధించిన మైసూరు.. వడయార్ల పాలనలో గణనీయమైన వృద్ధి సాధించింది. హొయసల రాజులు.. దేవాలయాలను అబివృద్ధి చేస్తే.. వడయార్ల కాలంలో మైసూరు మరింత సుందరంగా.. రమణీయంగా రూపుదిద్దుకుంది. క్రీస్తుశకం 1610లో మైసూరు రాజధానిగా ఉన్న శ్రీరంగపట్టణంలో రాజా ఒడయార్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. అప్పటి నుండి నిరవధికంగా, నిరాఘాటంగా, నాదహబ్బ ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్ర పండుగగా జరుపుకునే దసరా ఉత్సవాలు నాదహబ్బా పేరుతో ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా రాజా ఒడయార్ కాలం నుండి రాజదర్బార్ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. మహర్నవమి నాడు రాజ సింహాసనానికి విశేషపూజలు నిర్వహించిన తర్వాత ప్రస్తుత రాజకుటుంబీకుడు యదువీర్ కృష్ణదత్త చామరాడ ఒడయార్ .. మైసూరు ప్యాలెస్ లోని అంబా మహల్ లో రాజదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ కుటుంబీకులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్సవాల్లో చివరి రోజైన దశమి నాడు .. స్వర్ణ మందిరంలో ప్రతిష్టించిన చాముండేశ్వరీ దేవికి విసేష పూజలు నిర్వహించిన మీదట ఏనుగు అంబారీపై మైసూరు పుర వీధుల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపును జంబూ సవారీ అని వ్యవహరిస్తారు. అందంగా అలంకరించిన గజరాజులు .. వృషభ, తురగ వాహనాలు, ఒంటెలు అనుసరిస్తుండగా.. మేళతాళాలతో.. ఆనంద నృత్యాలతో ప్రజల జయజయ ధ్వనుల మధ్య మైసూరు ప్యాలెస్ నుండి మహా ప్రదర్శన మొదలవుతుంది. దారి పొడవునా సాకలు పోసి.. సాగిలపడి ప్రజలు.. అంబారీపై స్వర్ణ మందిరంలో కొలువుదీరిన అమ్మ వారికి మొక్కులు తీర్చుకుంటారు. మేడలపై నుండి పుష్పవృష్టి కురిపిస్తుండగా.. మందగమనంతో గజరాజులు ముందుకు కదులుతాయి. ప్యాలెస్ నుండి నాలుగు కిలో మీటర్ల దూరంలోని బన్నిమండప వరకు సాగే ఈ మహా ప్రదర్శనలో పోలీస్ బ్యాండ్ ఆకర్షణగా నిలుస్తుంది. దారి పొడవునా కర్నాటక సాంప్రదాయ జానపద నృత్య కళా ప్రదర్శనలు ఎంతగానో అలరిస్తాయి. మధ్యాహ్నం రెండు గంటల
సమయంలో మొదలయ్యే జంబూ సవారీ రాత్రికి గానీ బన్నిమండపకు చేరుకోదు. అక్కడ శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మ వారు తిరిగి ప్యాలెస్ కు చేరుకుంది. ఈ సందర్బంగా బన్ని మండప మైదానంలో వందలాది మంది కళాకారులతో నిర్వహించే కాగడాల ప్రదర్శన కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుంది.