అక్భర్ వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ
బీఆర్‌ఎస్, ఎంఐఎం మధ్య దూరం పెరుగుతుందా?
(గడ్డం కృష్ణమూర్తి)
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. నిన్నటి వరకు బీఆర్‌ఎస్ అజండాగా విమర్శలను ఎక్కుపెట్టిన కాషాయ పార్టీ తాజాగా ఆ పార్టీ మిత్రపక్షం ఎంఐఎం కదలికలపై కన్నేసేందుకు సన్నద్దమవుతోంది. బీజేపీకి మొదటి నుంచీ ఎంఐఎం బద్దశత్రువు అన్న విషయం తెలిసిందే. పాతబస్తీలో కేవలం ఒక్క నియోజకవర్గంలోనే తన ప్రభావం చూపిన పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో తన సత్తాను చాటేందుకు ఉవ్విళ్ళూరుతోంది. దేశంలో ఏ మూలన ఏ ఎన్నిక జరిగినా అక్కడ పోటీకి సై అంటూ కాలు దువ్వుతోంది. అయితే ఎంఐఎం పోటీ వెనుక బీజేపీ పెద్దలున్నారంటూ జాతీయ స్థాయిలో కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ తెలంగాణలో మటుకు ఎంఐఎం, బీజేపీలో ఉత్తర, దక్షిణ ధృవాలుగా వెళ్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య పాము, ముంగీస వైరం సాగుతోంది. నిన్నటి వరకు అధికార బీఆర్‌ఎస్ తో జట్టుకట్టిన ఎంఐఎం దేశవ్యాప్తంగా విస్తరించడంతో పాటు తెలంగాణలో మరింత గట్టి పునాదులు వేసేందుకు సన్నద్దమవుతోందంటూ శాసనసభలో ఆ పార్టీ పక్ష నేత అక్భరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
శాసనసభలో ఎంఐఎంకు కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. వీరంతా పాతబస్తీ నుంచే ప్రాతినిధ్యం వస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఐఎం తన శక్తిని నిరూపించుకునేందుకు మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలలోనూ పోటీ చేసి కొంత ఉనికిని చాటుకుంది. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరిగిన రెండు శాసనసభ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేస్తూ వస్తోంది. అయితే ఇదంతా బీఆర్‌ఎస్ తో ఉన్న లోపాయికారి ఒప్పందం మేరకు జరిగిందంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరోపిస్తూ వచ్చాయి. అన్నట్లుగానే బీఆర్‌ఎస్ ప్రతి నిర్ణయాన్ని ఎంఐఎం స్వాగతించడంతో పాటు ఎంఐఎం కోరిన కోరికలన్నింటినీ సీఎం కేసీఆర్ ఓకే చెబుతూ వస్తున్నారు. గ్రేటర్ హైదారాబాద్ విషయంలోనూ ఎంఐఎం, బీఆర్‌ఎస్ లు చెట్టాపట్టాల్ వేసుకుని పాలిస్తూ వస్తున్నాయి. కానీ తాజాగా శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ ను ఖంగుతినిపించడంతో పాటు బీజేపీలోనూ ఉలికిపాటుకు గురి చేసింది. జాతీయ స్థాయిలో బీజేపీకి సవాల్ విసురుతున్న ఎంఐఎం ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్ కు సవాల్ విసరడంపై రాజకీయ వర్గాలలోనూ చర్చ మొదలైంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 50 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేస్తామని, అసెంబ్లీలో 15 మంది ఎమ్మెల్యేలతో అడుగు పెడతామంటూ అక్భరుద్దీన్ చేసిన ప్రసంగంపై బీజేపీలో చర్చ మొదలైంది. అక్భర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఎంఐఎంలో చర్చకు వచ్చిందా… లేక బీఆర్‌ఎస్ ను బెదరించాలన్న దోరణితో చేసిన వ్యాఖ్యలా అన్న చర్చ మొదలైంది. ముందుగానే చర్చించిన అనంతరం అక్భర్ తన అనసులోని మాటను బహిర్గతం చేస్తే బీఆర్‌ఎస్ తో తెగతెంపులకు ఎంఐఎం నిర్ణయించుకుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు పాతబస్తీకే పరిమితమైన ఎంఐఎం ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తరించేందుకు పావులు కదిపితే ఎలా అడ్డుకోవాలన్న అంశంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కాషాయ నేతలు అభిప్రాయపడుతున్నారు. పాతబస్తీని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్న ఎంఐఎం మిగతా పార్టీలకు ఏ మాత్రం తావివ్వడం లేదని, తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తే రాష్ట్రంలో పార్టీలకు ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉందని కూడా కమలం నేతలు అభిప్రాయపడుతున్నారు. బీఆర్‌ఎస్ వ్యూహంలో భాగంగానే ఎంఐఎం రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్ళించేందుకు ఈ ప్రకటన చేసి ఉండవచ్చని మరికొంత మంది నేతలు అభిప్రాయపడుతున్నారు.
అదే జరిగితే మంచిదే
రాష్ట్రంలో 50 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తే బీజేపీకే కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ బీజేపీ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్లు ఉంటుందని, ఎంఐఎం కూడా బరిలో నిలిచి హోరాహోరి తలపడితే బీఆర్‌ఎస్ ఓట్లు మాత్రమే చీలి బీజేపీకి కలిసి వస్తుందని కాషాయ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ హిందూత్వ నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది, దీంతో ప్రజల్లో ఇప్పుడిప్పుడే పార్టీ పట్ల కొంత సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ ను వీడి ఎంఐఎం ఒంటరిగా బరిలోకి దిగితే కమలానికి కలిసి వస్తుందన్న విశ్వాసాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీతో పాటు ఎంఐఎంకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో బీఆర్‌ఎస్ కు భారీగా ఓట్లు చీలే అవకాశాలున్నాయని, ఇదే సమయంలో తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.