తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకుగాను బీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఏపీ నుండి పలువురు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్ లో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా ఖమ్మంలో భారీ ఎత్తున బీఆర్‌ఎస్ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ కనిపించక పోవడం అందరిని ఆశ్చర్య పరిచింది.
మొదటి నుండి కూడా కేటీఆర్ బీఆర్‌ఎస్ కి దూరంగానే ఉంటున్నాడు. జాతీయ స్థాయిలో ఈ పార్టీని తీసుకు వెళ్లాలి కనుక కేసీఆర్ మరియు ఆయన కొడుకు అన్నట్లుగా జాతీయ మీడియాలో ప్రచారం జరగకుండా కేటీఆర్ ని పూర్తిగా దూరంగా ఉంచుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ కేవలం రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవ్వాలని, భవిష్యత్తులో బీఆర్‌ఎస్ దేశ వ్యాప్తంగా బలం పుంజుకున్న తర్వాత అప్పుడు కేటీఆర్ ని రంగంలోకి దించాలని కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. వారసత్వం అంటూ విమర్శలు రాకుండా కేసీఆర్ తీసుకునే నిర్ణయం చాలా తెలివైన నిర్ణయమే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.