నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయడంలేదు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాద్రి కొత్తగూడెం: పోడు భూముల వ్యవహారం, నిరుద్యోగ భృతి, దళితులకు మూడు ఎకరాల భూమి వంటి ఎన్నో హామీలను బుట్టదాఖలయ్యాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమిలి పేట లో జరిగిన అభిమానుల ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కేసీఅర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణలో పోడు రైతులకు పట్టాలు పంపిణీ ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నించారు. తెలంగాణలో బతుకులు బాగు పడతాయని నాడు ఉద్యమంలో పాల్గొన్న వారి ఆకాంక్షలు ఇంతవరకు నేరవేరలేదని విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ళు కలగానే మారాయన్నారు.
నిరుద్యోగ భృతి హామీ ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. పంచాయితీలకు పెండిరగ్ బిల్లులే మంజూరు చేయలేదు గానీ.. ప్రతి పంచాయితీకి రూ. 10 లక్షలు మంజూరు చేస్తామన్న సీఎం కేసీఅర్ హామీ హాస్యాస్పదంగా ఉందని పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో మహిళా సర్పంచ్ లు మెడలో తాళిబొట్టు తాకట్టు పెట్టి బిల్లులు చెల్లిస్తున్న దుస్థితి లో ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే.. ప్రజాభిప్రాయం ప్రకారమే పార్టీ మారే నిర్ణయం తీసుకుంటామన్నారు. అశ్వరావుపేట అభ్యర్థిగా జారే ఆదినారాయణను పొంగులేటి ప్రకటించారు. తాను ఏ పార్టీలో ఉన్నా తన వర్గీయులకు టికెట్ ఇచ్చే దమ్ముంది కాబట్టే అభ్యర్థులను ప్రకటిస్తున్నానన్నారు. ముఖ్యమంత్రులు అంటే ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ మాదిరి ప్రజల గుండెల్లో ఉండాలంటూ పరోక్షంగా సీఎం కేసీఅర్‌ను ఉద్దేశించి అన్నారు.