పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ బస్సు అదుపుతప్పి లోయలో పడి.. మంటలు చెలరేగిన ఘటనలో 40 మంది దుర్మరణం చెందారు. దాదాపు 48 మంది ప్రయాణికులతో ఈ వాహనం క్వెట్టా నుంచి కరాచీకి వెళ్తోందని లాస్బెలా అసిస్టెంట్ కమిషనర్ హంజా అంజుమ్ తెలిపారు. మృత దేహాలు గుర్తుపట్టలేనంతగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ మహిళ, చిన్నారితో సహా ముగ్గురిని రక్షించినట్లు అంజుమ్ తెలిపారు. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఘటనాస్థలి నుంచి 17 మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ అధిక వేగం, నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. డెడ్ బాడీస్ ను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. గత ఏడాది నవంబర్‌లో దక్షిణ పాకిస్తాన్‌లోని ఓ లోయలు మినీ బస్సు పడిన ఘటనలో 11 మంది చిన్నారులతో సహా 20 మంది మరణించారు. అదే ఏడాది ఆగస్తులో ముల్తాన్ నగర శివార్లలో ఒక బస్సు చమురు ట్యాంకర్‌ను ఢీకొనడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, 2018లో పాకిస్తాన్ లో రోడ్డు ప్రమాదాల కారణంగా 27వేల మందికిపైగా మరణించారు.