తంగేడు పూలు తలలోన తురిమి
బంతి చామంతులతోటి అందంగ మారి
గునుగు గుమ్మడి పూలలోన
గౌరమ్మగా నిలిచి
నందివర్ధనమై నడి వీధి నడయాడి
బతుకమ్మ ఆటలతో
బొమ్మల కొలువులతో
వచ్చింది వచ్చింది
పండగొచ్చింది
సంతసాన్ని పండిస్తు
సంబరాలు పొంగిస్తు
దసరాగ వచ్చింది
సరదాను తెచ్చింది
జానపదాలు జాలువారగ
ఆటపాటలతో
ఊరు వాడంత అలరార
అమ్మ దేవతలకు మొక్కి
తెలగాణ సంస్కృతిని చాట
చప్పట్ల చరుపులతో
కాలి అందియలు మోగ
వచ్చింది వచ్చింది
పండగై వచ్చింది
ప్రతి ఇంట బతుకమ్మ నిలిచి
దుర్గమ్మ నుదుటి
సింధూరమై మెరిసి
నవ్యోత్సవమై
నవరాత్రోత్సవమై
త్రేతాయుగ ప్రాధాన్యమై
ద్వాపర యుగ ప్రాముఖ్యమై
యుగయుగాలు దాటి
కలియుగాన చేరి
తిరుమల బ్రహ్మోత్సవ శోభయై
శరన్నవరాత్రుల దీప్తియై
వచ్చింది వచ్చింది
పండగై వచ్చింది
పసిడి కాంతులతో
మెరిసింది
వూరు వాడంత మురిసింది
— అళహరి శ్రీనివాసాచార్యులు