ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రయాణికులు
నగరంలో శుక్రవారం ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. పలు మార్గాల్లో ట్రాక్ మరమ్మతుల కారణంగా తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 19 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.
రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల విషయానికొస్తే.. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 6 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 5 సర్వీసులు, హైదరాబాద్-లింగపల్లి మార్గంలో 3 సర్వీసులు ఉన్నాయి. అలాగే లింగంపల్లి-హైదరాబాద్ మార్గంలో 2 సర్వీసులు, ఫలక్‌నుమా-రామచంద్రపురం, ఫలక్‌నుమా-హైదరాబాద్, రామచంద్రపురం-ఫలక్‌నుమా మార్గాల్లో ఒక్కొ సర్వీసును రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. పలు మార్గాల్లో ట్రాక్‌లకు మరమ్మతులు చేయాల్సి ఉందని, అందుకే ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రయాణికలందరూ సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మెట్రో, సిటీ బస్సులను ఆశ్రయిస్తున్నారు.