AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నవరాత్రి కాంతుల్లో శోభిల్లుతున్న శ్రీశైలం

ఈ చరాచర ప్రపంచంలో సకల ప్రాణుల్లో, సర్వ జీవ కోటిలో అంతరాత్మగా, జ్యోతిస్వరూపంగా వెలుగొందే తల్లి ఆ.. ఆది పరాశక్తి. ఎన్ని అపరాధాలు చేసినా .. అమ్మా అని భక్తితో కొలిస్తే చాలు పాపాగ్నిని చల్లార్చి, కరుణామృత ధారలను వర్షించే చల్లని మూర్తి ఆమె. ఏ వేదాన్ని పరికించినా.. పరిశీలించినా .. పఠించినా ఆ.. జగదాంబిక దివ్య లీలలే కనిపిస్తాయి. ముక్కోటి దేవతలు సైతం ఆ.. తల్లిని శరణు వేడుకున్నాకే తమ కార్యాచరణను ప్రారంభిస్తారు. అంతటి మహిమాన్విత మూర్తి ఆమె. వారు వీరు అనే బేధం లేకుండా అందరికీ భోగ మోక్షాలను ప్రసాదించే భాగ్య దేవత ఆమె. శక్తి తత్వంలోని మూల రహస్యాన్ని వివరించడం, వర్ణించడం ఎవరి వల్లా కాని పని. అలాంటి శక్తి స్వరూపిణిని దర్శించు కోవడమే ఓ భాగ్యం. ఆమెను సేవించుకోవడం పూర్వ జన్మ సుకృతం. ఆమెపై అపారమైన భక్తిని చాటుకోవడం , నిరంతరం ఆ తల్లి ధ్యానంలో గడపడం అంటే .. నిజంగా ఆ అమ్మ వర ప్రసాదంగానే భావించాలి. అటువంటి దివ్యమూర్తి.. భ్రమరాంబాదేవీ రూపంలో శ్రీశైల క్షేత్రంలో దర్శినమిస్తోంది.

అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవ క్షేత్రం శ్రీశైలం. సతీదేవి దేహ ఖండాలలో మెడ భాగం పడిన ప్రదేశం. కేవలం శక్తి పీఠమే కాదు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. అత్యుద్భుతమైన క్షేత్రం. పరమ పావనమైన క్షేత్రం. పాపాలను హరించి పునర్జన్మ లేకుండా చేసే దివ్య క్షేత్రం. ఇక్కడ కొలువైన భ్రమరాంబాదేవి దివ్య చరితాన్ని, ఆ అవతార విశేషాన్ని సంపూర్ణంగా చెప్పడం, వర్ణించడం ఎవరికీ సులభ సాధ్యం కాదు. ఆ జగన్మాత మీద మనసు లగ్నం చేసి దేవీ వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ భక్తి.. ముక్తి ప్రదమవుతుంది. ఆ తల్లి అనుగ్రహంతో వాగ్వైభవాన్ని పొందిన వారు సహస్ర ముఖాలు కలిగిన బ్రహ్మలే అవుతారు. అంతటి శక్తి సంపన్నురాలు భ్రమరాంబా దేవి. దృశ్యా దృశ్య రూపాలతో విరాజిల్లుతూ.. సువర్ణ కాంతులతో రాజిల్లుతూ.. జగత్తును పాలిస్తున్న జనని ఆమె. ఆ తల్లి దివ్య సులోచనాలు సంకోచ వికాసాలకు కారణ భూతాలు. వ్యక్తా వ్యక్త స్వరూపిణి అయిన ఆ భ్రమరాంబాదేవి తత్వం దేవతలకే బోధ పడనిది.

సతత హరితంగా విలసిల్లే ప్రకృతి శోభ.. సమస్త జలాలోని కళ.. ఫల, పుష్ప సముదాయాలలోని కోమలత్వం.. అవధిలోని ఆవిష్కార లక్షణం.. వీటన్నింటిలోనూ ఆ శక్తి తేజం నిక్షిప్తమై ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ప్రతి జీవికీ ఏదో ఒక విశిష్టమైన ప్రజ్ఞ ఉంటుంది. ఆ.. ప్రజ్ఞాపాటవం అమ్మ వారి రూపం. ఓ సత్ సంకల్పాన్ని అనుకొని ఆధ్యాత్మిక మార్గంలో సాగినంతకాలం ఆ.. శక్తి స్వరూపం వారినే అంటి పెట్టుకు ఉంటుంది. అలాంటి దివ్య శక్తి ప్రదాతను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీగిరి పర్వత శ్రేణిపై కొలువైన భ్రమరాంబాదేవీని మనసా, వాచా, కర్మణా సేవిస్తే చాలు ఐహిక పాప కర్మలన్నీ నశిస్తాయని చెబుతారు. రశీగిరిల ప్రత శ్రేణినే శ్రీకైలాసం అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ జ్యోతిస్వరూపుడై ఆ కైలాస నాధుడు మల్లికార్జున స్వామిగా దర్శనమిస్తాడు. ద్వాపర యుగంలో పాండవులు ఈ క్షేత్రాన్ని సందర్శించి మలవ్లికార్జుని సేవించుకున్నట్లు శ్రీశైల క్షేత్ర పురాణాలలో కనిపిస్తుంది. అలాగే.. త్రేతాయుగంలో శ్రీరామ చంద్రుడు కూడా భ్రమరాంబా మల్లికార్జున
స్వామి వ్ర్లను దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇక్ష్వాకులు నుండి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, రెడ్డి రాజులు ఎందరో ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడంతో పాటు ఆ స్వామి వారి సేవలో తరించిన వారే.

గాయత్రీ మంత్ర జప బలంతో.. అరుణాసుడు అనే రాక్షసుడు రెండు, నాలుగు కాళ్ళతో నడిచే ఏ జీవి నుండి తనకు మరణం లేకుడా ఆ బ్రహ్మను మెప్పించి వరం పొందుతాడు. అప్పటి నుండి దేవతలను హింసిస్తుండడంతో వారంతా ఆ ఆదిపరాశక్తిని వేడుకున్నారు. అందుకు అమ్మ వారు ఓ ఉపాయాన్ని ఆలోచించి చెబుతుంది. దేవతలందరూ కలిసి బృహస్పతిని అరుణాసురుని దగ్గర కు పంపుతారు.
గాయత్రీ మంత్రో పాసకుడైన అరుణాసురుడిని పథకం ప్రకారం ఆ గాయత్రీ మంత్రాన్ని పఠించకుండా చేస్తారు. ఎప్పుడైతే జపాన్ని ఆపేశాడో అప్పుడు అమ్మ వారు కోపోద్రిక్తరాలై భ్రమ రూపంలో ఆ అరుణాసురుడిని సంహరిస్తుంది. అప్పటి నుండి భ్రమరాంబా దేవీగా శ్రీశైల క్షేత్రంపై కొలువై ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తి పీఠంలో అమ్మ వారికి నవ దుర్గా రాధనలతో పూజాదికాలు
నిర్వహిస్తారు. శరన్నవరాత్రుల కాలంలో అమ్మ వారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘాటాదేవీ, కూష్మాండాదేవి, స్కందమాత, కాత్యాని,, కాలరాత్రి, సిద్ధిధాత్రి, మహాగౌరీ రూపంలో దర్శనవమిస్తుంది. కార్తీక మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల పాపాలు హరిస్తాయని అంటారు. ఇది ఓ ఆధ్యాత్మిక దివ్యధామం. ఇక్కడ శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ అంటూ ఉండదని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
ఆది శంకరులు వారు తపమొనర్చిన ప్రదేశం… దుర్గాదేవికి పరమ భక్తుడైన ఛత్రపతి శివాజీ అమ్మ వారి నుండి వీరఖడ్గాన్ని అందుకున్న క్షేత్రం. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్ర మహిమలు కానీ.. మహత్యం కానీ చెప్పనలవి కాదు. ఎన్నో విశేషాల సమాహారం శ్రీశైలం. సమస్త దేవతలు కొలువుదీరిన దివ్యధామం. అన్ని శక్తి పీఠాలలోకెల్లా దేదీప్యమైనమై వెలుగొందుతున్న అత్యంత పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం శ్రీశైలం. ఇక్కడ నెలవైన మహిమాన్విత మూర్తులను వీక్షిస్తే చాలు అన్ని కోరికలు ఇట్టే నెరవేరుతాయి. మనలను అంటి పెట్టుకుని ఉన్న సమస్య దోషాలు ఇట్టే తెలగి పోతాయి. కృష్ణమ్మ సరసన ఉన్న ఈ క్షేత్ర అందాలు కూడా వర్ణించలేనటువంటివి.

గాయత్రీం గరుఢధ్వజాం గగన గాం.. గాంధర్వ గాన ప్రియామ్
గంభీరాం గజ గామినీం గిరి సుతామ్ .. గంధాక్షతా లంకృతామ్
గంగా గౌతమ గర్గ సన్నుత పదాం .. గాం గౌతమీం గోమతీమ్
శ్రీశైల స్ధల వాసినీం భగవతీఁ.. శ్రీమాతరం భావయే

సువిశాలమైన ప్రాంగణంలో .. అత్యంత పటిష్టవంతమైన ప్రాకారం నడుమ విరాజమానమై తేజరిల్లుతున్న ఆ శక్తి రూపిణి దర్శనం పూర్వ జన్మ సుకృతమే. ఈ క్షేత్రంలో ముందుగా అర్ధనాశ్వర రూపంలో అమ్మ వారు వెలశారని చెబుతారు. అయినప్పటికీ భ్రమరాంబా దేవే ఇక్కడ శక్తి రూపిణిగా పూజలందుకొంటోంది.

— అళహరి శ్రీనివాసాచార్యులు

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10