AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేవరగట్టులో రేపు కర్రల యుద్ధం

పండగొచ్చింది. మనసులో భక్తి ఉప్పొంగుతోంది. ఆ ప్రాంతం మాల మల్లేశ్వరుణ్ణే స్మరిస్తోంది. ప్రశాంతత తొణికిసలాడుతున్నట్లు కనిపించినా .. విజయ దశమి రోజు ఏం జరుగుతుందో మాత్రం ఎవ్వరూ ఊహించలేక పోతున్నారు. అటు పోలీసులు అన్ని రకాలుగా కన్నేసే ఉంచారు. కానీ .. జనావేశాన్ని ఆపగలరా? భక్తి పారవశ్యాన్ని నిలువరించగలరా ? అవగాహనా సదస్సులు, సమావేశాలు ఫలితాన్నిచ్చేనా ? ఇంతకీ దేవరగట్టులో ఏం జరుగుతోంది.

దేవరగట్టు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ప్రాంతీయ పుణ్య క్షేత్రం. మాల మల్లేశ్వరుడు కొలువుదీరిన కొండ ప్రాంతం. ఏడాదిలో ఒక్కరోజు లక్షలాది మంది భక్తుల రక్తంతో తడిసే ప్రాంతం. విజయదశమి వచ్చిందంటే .. అక్కడ సందడే సందడి. తెలియని పారవశ్యం పొంగులారాల్సిందే. గ్రామాలకు గ్రామాలు కర్రలెత్తి పొలో మనాల్సింది. నిశిరాత్రిలో.. కాగడాల వెలుగుల్లో కపాలాలు టపటపామని పగాల్సిందే. ఎత్తిన కర్రలు దించకుండా గాల్లో విన్యాసాలు చేయాల్సిందే. ఎందుకిందంతా ? దేనికోసం ఈ యుద్ధమంతా ? దసరా రోజున దేవరగట్టులో గొడవపడే వారంతా స్ధానిక కొండపై కొలువు దీరిన మాళవి మల్లేశ్వరుని భక్తులే. మూడు గ్రామాల ప్రజలే కాదు సమీప రాష్ట్రాల నుండి కూడా విజయదశమి రోజున అక్కడ జరిగే కర్రల యుద్ధాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున దేవరగట్టుకు తరలి రావడం పరిపాటి. కొండపైన స్వామి వార్లకు కల్యాణోత్సవం పూర్తయ్యాక ఉత్సవ మూర్తులను పల్లికిలో కిందకు తీసుకు వస్తారు. సింహాసనం కట్ట మీద కొలువుదీరుస్తారు. అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. నినాదాలు మిన్నుముడతాయి. కాగడాలు పైకిలేస్తాయి. జైత్రయాత్ర పేరిట నిర్వహించే బన్నీ ఉత్సవానికి తెర లేస్తుంది. సరిగ్గా రాత్రి పన్నెండున్నర కాగానే.. ఎవరు ఎవరి మీద దాడికి దిగుతున్నారో తెలియదు. వావి వరసులు ఉండవు. చిన్నా పెద్దా అని తేడా ఉండదు. చేతిలో కర్రుంటే చాలు. కొట్టుకుంటూ వెళ్ళాల్సిందే. స్వామి వార్లను దక్కించుకునేందుకు తమ ప్రయత్నం తాము చేయాల్సిందే.

కొత్తపేట, నెరనిక, నెరనిక తండా గ్రామాలు ఈ ఉత్సవం నిర్వహణ గ్రామాలుగా ఉంటే.. సుల్వాయి, అరికెర, అరికెర తండా, ఆలూరు, ఎల్లార్పి గ్రామాలు స్వామి వారిని దక్కించుకునేందుకు పోటీ పడతాయి. స్ధానిక నంది గుడి నుండి రాక్షస గుడి వరకు రెండు ఫర్లాంగుల మేర జరిగే ఈ యుద్ధంలో విచక్షణ అనేదే ఉండదు. అన్ని వర్గాల వారు పాల్గొంటారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇందులో పాల్గొనడం విశేషం. ఓ రకంగా కాలం ఎంత అభివృద్ధి దిశలో పరుగులు తీసినా అక్కడ మాత్రం అనాగరికం.. ఆటవిక కర్రల యుద్ధం రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి ఏడాది ఇదో సాంప్రదాయంగా నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్ని రకాల ఆంక్షలు పెట్టినా, ఎవరు అడ్డుకున్నా యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఎప్పుడు దసరా వచ్చినా అక్కడ పరిస్ధితులు పోలీసులను పరుగులు పెట్టిస్తాయి. బన్నీ ఉత్సవం పేరిట జరిగే కర్రల యుద్దాన్ని నివారించాలని గతంలో ఎంతో మంది ప్రయత్నించారు. కానీ .. ఫలించలేదు. గతంలో కర్నూలు జిల్లా ఎస్పీలుగా పని చేసిన పులువురు అధికారులు ఎంతగానో కృషి చేశారు. బన్నీ ఉత్సవంలో పాల్గొనే గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి .. అవగాహన కల్పించేందుకు తమవంతు ప్రయత్నాలు చేశారు. ఆయా గ్రామాల్లో ఇళ్ళలో కర్ర అనేది కనిపించకుండా .. అన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఎంతో మందిని బైండోవర్ చేశారు. కానీ .. రాత్రి పన్నెండున్నర కాగానే ఎక్కడ నుంచి వచ్చారో ఒక్కసారిగా లక్షలాదిగా జనం వచ్టి పడ్డారు. జరగదు అనుకున్న యుద్ధం జరగనే జరిగింది. వారికి అదో సాంప్రదాయం. భక్తిలో భాగమైన నమ్మకం. ఆధునికత ఎంత సంతరించుకున్నా .. అనూచాన పద్ధతిని మాత్రం వీడరు. ఎవరు ఎన్ని రకాల అభ్యంతరాలు చెప్పినా.. ఆంక్షలు విధించినా బన్నీ ఉత్సవాన్ని మాత్రం మానరు.

ఎప్పటి లానే ఈసారి కూడా బన్నీ జైత్రయాత్రకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నెరనికి గ్రామంలో మాళవి మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. కంకణధారణ చేస్తారు. దీంతో బన్నీ ఉత్సవానికి అంకురార్పణ జరిగినట్టు భావిస్తారు. పండక్కి రెండు రోజుల ముందు నుంచే దేవరగట్టు గ్రామం బంధువులతో కళకశ లాడుతూ కనిపిస్తోంది. ప్రతి ఇంటా సందడి కనిపిస్తూ ఉంది. జన నియంత్రణ మాత్రం తమ చేతుల్లో లేదని .. ఇతర ప్రాంతాల నుండి తరలి వచ్చే భక్తులను నిలువరించడం తమ వల్ల కాదని తేల్చి చెబుతున్నారు స్ధానికులు. దేవరగట్టు అంటేనే కొండలు.. గుట్టలు. అక్కడకు వెళ్ళడానికి అనేక మార్గాలు. ఆంక్షలు ఎన్ని పెట్టినా .. ఎప్పటి నుంచి అమలులో ఉన్నా ప్రతి సంవత్సరం కర్రల యుద్ధం మాత్రం అక్కడ ఆగడం లేదు. ఈసారి పోలీసులు ఎంత పట్టుదలగా ఉన్నా.. ఏం జరుగుతుందో మాత్రం చెప్పలేమని స్ధానికులు అంటున్నారు. పూర్వం నుండి వస్తున్న ఆచారాన్ని వదిలి పెట్టే ప్రసక్తే లేదని కొంతమంది తెగేసి చెబుతున్నారు. ఈక్రమంలో దేవరగట్టు ఉత్సవంపై ఉత్కంఠ నెలకొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10