వచ్చే ఎన్నికల్లో హంగ్ ఖాయం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హంగ్ రావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్లకు మంచి రావన్నారు. ఆయన మాటలతో రాష్ట్రంలో కొత్త పొత్తులు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పొత్తు ఖాయమని గతంలో ప్రచారం జరగ్గా.. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు ఆ వార్తలు మరింత బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు పేర్కొనడం గమనార్హం. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొత్తుల రాజకీయం తెరపైకి రావడంతో సర్వత్రా జోరుగా చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వెంకటరెడ్డి వ్యాఖ్యలతో నిజంగానే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది.
మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. హైదరాబాద్-విజయవాడ హైవేను ఆరు లైన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి రావడం కల్ల అన్నారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌తో కలవక తప్పదని అభిప్రాయపడ్డారు. బీజేపీతో కాంగ్రెస్ కలిసే అవకాశాలు లేవన్నారు. పార్టీ సీనియర్లు అందరూ కలిస్తే 40 నుంచి 50 సీట్లు వచ్చే అవకాశం ఉందని కోమటి రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎవరికీ 60 సీట్లు రావని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది హంగ్ మాత్రమే అని జోస్యం చెప్పారు. మార్చి 1వ తేదీ నుంచి పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మార్చి మొదటి వారంలో యాదాద్రి నుంచి యాత్ర పారంభిస్తామని వెల్లడిరచారు. కొత్త ఇన్‌చార్జ్‌గా ఠాక్రే వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ గాడిలో పడిరదని తెలిపారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక్కడే గెలిపిస్తానంటే తాము ఇంట్లో కూర్చుంటామని అన్నారు.
‘గెలిచే వారికే టికెట్ ఇవ్వాలి. ఒంటరిగానే పోరుడుతాం… ఎన్నికల తర్వాత పొత్తులు తప్పవు’ అని వెంకట్‌రెడ్డి చెప్పారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మన్మోహన్ సింగ్‌పై కేసీఆర్ పొగడ్తలు కురిపించడంతో రాష్ట్రంలో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పొత్తుపై మరోసారి ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై పాదయాత్రలో స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అండ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ బీఆర్‌ఎస్‌తో కలిసేదే లేదని తేల్చిచెప్పారు. కాలనాగునైనా కౌగిలించుకుంటామని, కేసీఆర్‌తో మాత్రం కలిసేదే లేదని క్లారిటీ ఇచ్చారు.