AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒకే గదిలో ఇద్దరు స్నేహితుల ఆత్మహత్య..

హైదరాబాద్‌: వారిద్దరివి వేరు వేరు ప్రాంతాలు. ఓ సందర్భంలో పరిచయం ఏర్పడి మంచి మిత్రులయ్యారు. ఒకే గదిని అద్దెకు తీసుకొని చాలా రోజులుగా కలిసే ఉంటున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇద్దరూ కలిసి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరు ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోగా.. మరొకరు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈ విషాదకరణ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం కోరుకొండకు చెందిన గోరుగుల సాయిగణేశ్‌ (21) నారపల్లిలోని ఎంజేఆర్‌ మాల్‌లో పని చేస్తున్నాడు. మేడ్చల్‌ మండలం ఘనపూర్‌కు చెందిన తొంపల రాజు కుమారుడు నివాస్‌(19) ఘట్‌కేసర్‌లోని ప్రిన్స్‌టన్‌ కళాశాలలో బీ-ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అనుకోకుండా కలిసిన వీరిద్దరూ.. మంచి స్నేహితులయ్యారు. అనంతరం కళాశాల సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నారు.

అయితే ఏం జరిగిందో తెలియదు కానీ యువకులు ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. నివాస్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోగా.. సాయి గణేష్‌ స్నానాల గదిలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. యువకులిద్దరూ ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వ్యక్తం చేసిన ఇంటి యజమాని డోర్‌ కొట్టాడు. ఎవరూ డోర్‌ తీయకపోవటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. యువకులిద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

‘అమ్మానాన్న క్షమించండి.. నాకు చెడు అలవాట్లు ఉన్నాయి’ అంటూ నివాస్‌ రాసినట్లు ఉన్న లేఖ గదిలో లభ్యంగా కాగా. పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి సెల్‌ ఫోన్‌ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10