హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కేసును సీబీఐకి అప్పగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. సీబీఐకి అప్పగిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తప్పుబట్టలేమని అందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
మరోవైపు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉందని.. తీర్పును 15 రోజుల పాటు అమలు చేయకుండా చూడాలని సీజే ధర్మాసనాన్ని అడ్వకేట్ జనరల్ కోరారు. అయితే దానికి హైకోర్టు నిరాకరించింది.
దీంతో బీజేపీపై పోరాడుతున్న కేసీఆర్‌కు కాలం కలిసిరాలేదని బీఆర్‌ఎస్ శ్రేణులు వాపోతున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరుకునపెట్టాలని చూసిన కేసీఆర్ కు న్యాయస్థానంలో చుక్కెదురైందన్న చర్చ సాగుతోంది.