టీటీడీ సరికొత్త ఆలోచన..
టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం విక్రయాలకు సంబంధించి తాటాకు బుట్టలను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఈవో ధర్మారెడ్డి పలు రకాల బుట్టల్ని పరిశీలించారు. ఈ నిర్ణయంతో ప్రకృతి పరిరక్షణతో పాటూ పలువురికి ఉపాధి కల్పించినట్లవుతుందని టీటీడీ ఆలోచన చేస్తోంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో బుట్టలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.
తిరుమలలో లడ్డూ ప్రసాదాల పంపిణీకి సంబంధించి టీటీడీ ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకుంది. లడ్డూ విక్రయ కేంద్రాల పెంపుతో పాటూ ప్రసాదం తయారీ కోసం ఆత్యాధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తిరుమలలో లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో కొత్త వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇప్పుడు తాటాకు బుట్టలను లడ్డూ విక్రయ కేంద్రాల్లో భక్తులకు అందుబాటులోకి తేవాలని ఆలోచన చేస్తోంది.
తిరుమలలో రోజుకు ఆరు లక్షల లడ్డూల తయారీకి వీలుగా ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే బూందీ తయారీకి స్టవ్‌ల అవసరం ఉండదు. ఈ యంత్రాలను స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల భక్తులకు తగినంత స్థాయిలో లడ్డూలు వేగంగా సిద్దం చేయటానికి అవకాశం ఏర్పుడుతందంటున్నారు. నాణ్యత విషయంలో కూడా రాజీ ఉండదు. రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ యంత్రాలను తీసుకొస్తోంది.