ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పిన ఎగ్టిట్ పోల్స్ జోస్యాలు తల్లకిందులు అయ్యాయి. పదేళ్ళ విరామం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ ఘోషించాయి. కౌంటింగ్ మొదలైన కొద్ది సేపటికే చాలా నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు ఆ తర్వాత వెనకబడుతూ వచ్చాయి. 48 స్ధానాల్లో విజయ కేతనం ఎగరేసి మేజిక్ ఫిగర్ ను దాటేసింది. 36 స్ధానాలకు కాంగ్రెస్ ను పరిమితం చేసింది. దీంతో కమలనాధుల శిబిరంలో ఆనందోత్సాహాలు నెలకొనగా.. కాంగ్రెస్ పార్టీలో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయి. చివరి వరకు ధీమాను వ్యక్తం చేస్తూ వచ్చిన కాంగ్రెస్ నాయకులు .. బీజేపీ పైచేయి సాధిస్తుందని మాత్రం ఊహించలేక పోయారు. కాంగ్రెస్ ను ఓడించి ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇప్పుడు ఆ పార్టీ నేతలు పూర్తిగా
ఆనందంలో మునిగి పోయారు. దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇది అనూహ్య విజయంగా అందరూ భావిస్తున్నా.. తాము ముందే ఊహించిన విజయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒకప్పుడు హర్యానాలో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దేవీలాల్ కుటుంబ సభ్యులను ప్రజలు తిరస్కరించారు. కలాన్, ఎలీనాబాద్, దుబ్వాలీ, రనియా నియోజకవర్గాల్లో వారికి పరాభవం తప్పలేదు. ఇండియన్ లోక్ దళ్ పార్టీ తరపున పోటీ చేసిన దేవీలాల్ కుటుంబ సభ్యులు ఓటర్ల మన్ననలు పొందలేక పోయారు. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా.. 48 స్ధానాలను కైవసం చేసుకుని, బీజేపీ మేజిక్ ఫిగర్ ను అందుకుంది. పోటీ చేసిన అన్ని చోట్ల నువ్వానేనా అన్న రీతిలో ఉత్కంఠ నెలకొంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి హర్యానాలో చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ సొంత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క స్ధానంలో కూడా ఆ పార్టీ ప్రభావాన్ని
చూపించలేక పోయింది. చాలా చోట్ల ఆప్ అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. ఎన్నికలకు ముందు హర్యానాలో అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేసిన కేజ్రీవాల్ కు ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అయితే కాశ్మీర్ ఎన్నికల్లో దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ తొలిసారి విజయం సాధించింది.
మరోవైపు జమ్మూకాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికారాన్ని దక్కించుకున్నాయి. 50 స్ధానాల్లో విజయం సాధించి ఈ రెండు పార్టీలు తిరుగులేని ఆధిక్యతను సాధించాయి. దీంతో అటు నేషనల్ కాన్ఫరెన్స్ .. ఇటు కాంగ్రెస్ కార్యాలయాల వద్ద కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాయి. కూటమి అభ్యర్ధిగా నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. పదేళ్ళ తర్వాత కాశ్మీర్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఒమర్ అబ్దుల్లా అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు తమకు కలిసి వచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడ బీజేపీ కేవలం 26 స్ధానాలకే పరిమితం అయ్యింది.