ప్రకృతి, పర్యావరణం బాగుండాలి, మానవాళికి స్వచ్చమైన ప్రాణవాయువు అందాలి అనే సంకల్పంతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. దేశ విదేశాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగురుతోంది. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాలి, ఆకు పచ్చని చెట్లను పెంచాలనే ప్రచారాన్ని విసృతంగా అన్ని వర్గాలకు చేరువ చేస్తోంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్. తాజాగా అంటార్కిటికాలో ఎత్తైన పర్వతంపైనా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పతాకం ఎగిరింది. ఏడు ఖండాల్లో ఏడు శిఖరాలను అధిరోహించే సవాల్ ను స్వీకరించిన భూపతిరాజు అన్మిష్ వర్మ విజయవంతంగా పూర్తి చేశాడు. భూగోళం చిట్టచివరలో, మంచు ఖండం అంటార్కిటికాలో ఎత్తైన పర్వతం మౌంట్ విన్షన్ ను అధిరోహించిన అన్మిష్ వర్మ, అక్కడ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండాను ప్రదర్శించాడు.
గ్లోబల్ వార్మింగ్ రూపంలో ప్రపంచానికి పర్యావరణ ముప్పు పొంచి ఉందని, దానికి ఎదుర్కొనేందుకు విరివిగా మొక్కలు నాటాలనే సంకల్పంతో రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం అని అన్మిష్ వర్మ అన్నారు. ఈ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి, అందరిలో పర్యావరణ స్పృహ కల్పించాలనే లక్ష్యంతో ఎత్తైన పర్వతాలను అధిరోహించి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పతాకాన్ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు. ఎవరెస్ట్ తో సహా ఏడు ఖండాల్లో ఏడు శిఖరాల అధిరోహణ విజయవంతంగా పూర్తి చేసినట్లు అన్మిష్ వర్మ తెలిపారు. భూగోళం దక్షిణ ధృవంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రదర్శించటం గర్వంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన ఎం.పీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించటం, స్వచ్చమైన పర్యావరణ దిశగా కృషి చేయటం విధిగా అందరూ పాటించాలని కోరారు.