సిద్ధిపేట: దక్షిణ భారత దేశ ధాన్యగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తీర్చిదిద్దారని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. దేశంలో వ్యవసాయం వృద్ధి రేటు 4% శాతం ఉంటే, కేవలం తెలంగాణ రాష్ట్రంలో 7.8% శాతం ఉందని, అన్నీ రంగాలలో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట పత్తి మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పొద్దు తిరుగుడు పువ్వు సాగు చేసిన రైతులకు శుభవార్తగా చెబుతున్నామని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చాక పొద్దు తిరుగుడు పువ్వు సాగు పెరిగిందని, ఈ యేడు 6200 ఎకరాల్లో రైతులు పొద్దు తిరుగుడు సాగు చేశారని ప్రశంసించారు.
మార్కెట్ ధర తక్కువ ఉన్నదని పొద్దు తిరుగుడు పువ్వు కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ప్రారంభించాలని రైతుల కోరిక మేరకు సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లామని, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిల నిర్ణయంతో ఈ పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో మొదటి పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రం సిద్ధిపేటలో ప్రారంభమైందని, రూ.6400 మద్ధతు ధరతో ప్రభుత్వానికి అమ్మితే రైతులకు ఉపయోగకరమని పేర్కొన్నారు.
జిల్లాలో 60 మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు పంట పండుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని, జిల్లాలో 6 వేల మంది రైతులు పొద్దు తిరుగుడు సాగు చేసినట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ వచ్చాక రైతుకు భరోసా దొరికిందని, కేంద్రం వడ్లు కొనమని చెప్పినా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొని రైతులకు సహకారాన్ని అందించిందని చెప్పుకొచ్చారు.