న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 19న తమ ప్రధాన కార్యాలయానికి రావాలని కోరినట్టు ఆయన శనివారం ట్వీట్ చేశారు. సిసోడియాకు సంబంధించి తాజా ఆధారాలు లభించడంతో ఆయనకు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. లిక్కర్ పాలసీని రూపొందించడంలోను, అమలులోను అవినీతి, అవకతవకలు జరిగినట్టు కొత్తగా ఆధారాలు లభించిన కారణంగా సీబీఐ తిరిగి సిసోడియాకు నోటీసులు పంపినట్టు భావిస్తున్నారు. అయితే తనను విచారించేందుకు ఈడీ, సిబిఐలకు పూర్తి అధికారాలు ఉన్నాయని, గతంలో కూడా అధికారులు తన ఇంటిపైన దాడులు నిర్వహించారని, తన బ్యాంక్ లాకర్ తెరిచి చూశారని సిసోడియా పేర్కొన్నారు. ఢల్లీి విద్యార్థులకు తాను విద్యాశాఖ మంత్రిగా కూడా మంచి విద్యను అందిస్తున్నానని అందుకే వారు (ఈ దర్యాప్తు సంస్ధలు) తనను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఏది ఏమైనా వారి దర్యాప్తునకు సహకరిస్తానన్నారు.