దేశవ్యాప్తంగా చర్చనీయాంశవుతోన్న కర్ణాటక ఐపీఎస్ రూపా మౌడ్గిల్ , ఐఏఎస్ రోహిణి సింధూరి మధ్య వివాదానికి బదిలీలతో ముగింపు పడిందని అందరూ భావించారు. కానీ, ఇరువురి మధ్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మైసూరుకు చెందిన సామాజిక ఉద్యమకారుడితో ఐపీఎస్ అధికారిణి రూపా మౌడ్గిల్ మాట్లాడిన ఫోన్ సంభాషణ ఆడియో లీక్ అయ్యింది. ఇందులోనూ రోహిణిపై రూపా తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. తన భర్త భూసర్వే డిపార్ట్‌మెంట్ కమిషనర్‌గా ఉన్న సమయంలో తనకు అందుబాటులో ఉండే కబినిలోని కొన్ని ఆస్తుల వివరాలను సింధూరితో పంచుకున్నాడని ఆమె ఆరోపించారు. సింధూరి కుటుంబం నడుపుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఈ రికార్డుల సమాచారం తీసుకున్నట్టు రూపా ఆ ఆడియోలో చెప్పారు. రూపా గతంలో సింధూరిపై చేసిన ఆరోపణలను మళ్లీ ఈ కాల్‌లో ప్రస్తావించారు. అంతేకాదు, నా భర్త మౌనీష్ మౌడ్గిల్‌ను బదిలీచేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు రూపా చెప్పారు.
ఈ నేపథ్యంలో తాజా ఆడియో వ్యవహారం కన్నడనాట మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే సా.రా మహేశ్ కేసు విషయంలో రాజీకోసం మాజీ సీఎం కుమారస్వామి , హెచ్‌డీ .దేవేగౌడ , ఇద్దరు ఐఏఎస్‌ల ద్వారా రోహిణి ఒత్తిడి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అంతేకాదు, గంగరాజుపైన కూడా రూపా ఈ సమయంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీరు ఆమెకు మద్దతుగా ఉన్నారా?.. నువ్వు ఫైల్ పట్టుకుని పదేపదే ఆమె వద్దకు వెళ్లడం తప్పా ఏముంది… కాల్ రికార్డు చేసుకుంటావా? చేసుకో నాకు వచ్చే కోపానికి..’’ అంటూ అసభ్య పదజాలంతో ఆమె విరుచుకుపడ్డారు.
ఐపీఎస్ రూపాతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను సామాజిక కార్యకర్త గంగరాజు బుధవారం విడుదల చేశారు. దీంతో వివాదం కొత్త మలుపు తిరిగి జఠిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తన పరిచయాలను ఉపయోగించుకుని భర్త అన్నను బీజేపీలోకి చేర్చాలని రోహిణి సింధూరి చూస్తోందని ఆడియోలో రూపా పేర్కొన్నారు. తన భర్త మౌనీశ్ తీరుపైనా, కుటుంబ వ్యవహారాలపైనా రూపా ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గంగరాజు మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎస్ రూపా నాపై ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. జనవరి 30న నాతో 25 నిమిషాలు మాట్లాడిన ఆమె.. రోహిణి సింధూరికి వ్యతిరేకంగా పోరాటం కోసం నన్ను పావుగా వాడుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఫోన్ చేసి భూ వ్యవహారాల గురించి సీబీఐ అధికారిలా ప్రశ్నించారని, నా మొబైల్ నుంచి ఫోటో తీసుకుని, వాట్సాప్ చాట్‌ను ఎమ్మెల్యే సా. రా మహేశ్‌కు పంపించారని తెలిపారు.
అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు. రోహిణి అక్రమాల గురించి నా వద్ద ఆధారాలున్నాయని, మీడియా వద్ద వాటి గురించి మాట్లాడమని కోరితే అందుకు నేను నిరాకరించానని గంగరాజు పేర్కొనారు. నా కుటుంబానికి జరగరానిదే ఏదైనా అయితే అందుకు కారణం రూపాయేనని, అధికారం మాటున ఆమె ఏమైనా చేయొచ్చని ఆయన ఆరోపించారు. ఆమె నా కదలికలు, కార్యకలాపాలపై నిఘా పెట్టారని, రూపాపై క్రిమినల్ కేసు వేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.