AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా

భారత్‌ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్‌ పూర్తికావడం సంతోషం
సోనియాగాంధీ సంచలన ప్రకటన

రాయ్‌పూర్‌: కాంగ్రెస్‌ ఎంపీ, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ప్రస్తావించారు. భారత్‌ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్‌ పూర్తికానుండటం సంతోషంగా ఉందని చెప్పారు. భారత్‌ జోడో యాత్రను పార్టీకి ఒక మేలి మలుపుగా ఆమె అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో రెండవ రోజైన శనివారం ఆమె ప్రసంగిస్తూ… ‘’భారత్‌ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్‌ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసిందని అన్నారు.

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్‌ పార్టీని మలుపుతిప్పిన భారత్‌ జోడో యాత్రతో ఇన్నింగ్స్‌ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి, యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారు. మల్లికార్జున్‌ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడి0చే లక్ష్యంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమంలో 15,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఇతర విపక్ష పార్టీలతో పొత్తులతో సహా 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఈ ప్లీనరీలో తీసుకోనున్నారు. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్‌ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేకు అప్పగించాలని కమిటీ నిర్ణయించింది. కాగా, భారత్‌ జోడో యాత్రతో తన రాజకీయ ఇన్నింగ్స్‌ ముగియనుందంటూ సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10