AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెడికో ప్రీతి మరణం అత్యంత బాధాకరం

 పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి   మరణం అత్యంత బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతికి నివాళి అర్పిస్తూ సోమవారం పవన్‌ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించిందన్నారు. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ యాజమాన్యం బాధ్యులపై సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.

డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలన్నారు. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలని సూచించారు. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలని యువతకు పవన్‌ కళ్యాణ్ హితవు పలికారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10