ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లు పాకిస్థాన్ మీడియా ఆదివారం తెలిపింది. ఆయన చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని, దుబాయ్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు పేర్కొంది.
ముషారఫ్ (79) దుబాయ్‌లోని అమెరికన్ ఆసుపత్రిలో అమిలోయిడోసిస్ వ్యాధికి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పాకిస్థాన్ మీడియా వెల్లడిరచింది. ఆయన 1943 ఆగస్టు 11న ఢల్లీిలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూలులో చదివారు. ఆ తర్వాత లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో చదివారు. 1961లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో చేరారు. పాకిస్థాన్ ఆర్మీలో 1964లో చేరారు. జనరల్ పర్వేజ్ ముషారఫ్ 1998 నుంచి 2007 వరకు పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుంచి 2001 వరకు చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా వ్యవహరించారు. 1999లో ఫెడరల్ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. ఆయన 2001 జూన్ 20 నుంచి 2008 ఆగస్టు 18 వరకు పాకిస్థాన్ దేశాధ్యక్షునిగా పని చేశారు.