36 గంటల్లో 15 వేల కంప్లైంట్స్!
హైదరాబాద్ వాసులను వీధి కుక్కల భయం వెంటాడుతోంది. ఇటీవల అంబర్‌పేట్‌లో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయడంతో.. ప్రజలు విపరీతంగా భయపడుతున్నారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రజలకు భరోసా ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. దీంతో వీధి కుక్కల పై జీహెంచ్‌ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 36 గంటల్లో కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నెంబర్‌కి ఏకంగా 15 వేల కంప్లైంట్స్ వచ్చాయి. గతంలో రోజుకు 30 వరకు ఫిర్యాదులు వచ్చేవని అధికారులు చెబుతున్నారు.
కేవలం హైదరాబాద్ లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా వీధి కుక్కలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో.. వీధి కుక్కల దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం గ్రామంలో.. శుక్రవారం ఉదయం ఇంటి గుమ్మం వద్ద ఆడుకుంటున్న 17 నెలల పాప జర్పుల భానుశ్రీపై వీధి కుక్క దాడి చేసింది.
సూర్యాపేటలోని రాజీవ్‌నగర్‌లో శుక్రవారం ఉదయం పదేళ్ల బాలుడు చెర్రిపై.. వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఛాతీపై గాయాలయ్యాయి. గురువారం రాత్రి ఇదే కాలనీకి చెందిన 11 ఏళ్ల తరుణ్, పదేళ్ల షేక్ షాహిన్ వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.