AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ్రహ్మోత్సవ వైభవం .. నామాల దేవుని సోయగం

ప్రకృతి అక్కడ పులకించి పరవశిస్తోంది. చల్లటి గాలులు పరవళ్ళు తొక్కుతున్నాయి. తరంగాలు.. తరంగాలుగా ఎగసి సప్తగిరులను చుట్టేస్తున్నాయి. అప్పుడప్పుడు సన్నటి వాన తుంపరులు.. ముత్యాల్లా రాలి పడుతున్నాయి. మబ్బులు సిగ్గుల మొగ్గలు తొడిగి .. ఆ శ్రీనివాసుని సేవలో లీనమవుతున్నాయి. ఘంటసాల గానం అమృతాన్ని చిలుకుతుంటే.. వేద మంత్రోచ్ఛారణలు ఆ వైకుంఠధాముడిని మైమరపింప చేస్తున్నాయి.ఆ మబ్బుల మాటున మహనీయులు ఎందరో దాగున్న అనుభూతి. కమ్ముకున్న పొగ మంచు తెరల మాటున .. ఎవరికీ కనిపించకుండా ..ముక్కోటి దేవతలు ఒక్కటై అక్కడ సంచరిస్తున్న దివ్యానుభూతి. భక్తజనం తన్మయత్వంతో చేసే గోవింద ధ్వనులు వినేందుకు.. ఏరూపులోవారి మధ్య ఆ శ్రీమన్నారాయణుడు దాగున్నాడో అన్న అనుమానం. ఏ ఆకారంలో నామాల దేవుడు అక్కడ తిరుగాడుతున్నాడో అన్న భావన. ఇది ఇప్పుడు తిరుమల క్షేత్రాన్ని చూస్తే ఎవరికైనా కలిగే అనుభూతులు.

గంగమ్మ ఉబలాటపడుతోంది.. ఆ వెంకన్న పాదాలు తాకాలని. వాయువు రివ్వున దూసుకు వస్తున్నాడు ఆ శ్రీహరిని చూడాలని. వరుణుడు తెగ సంబరపడుతున్నాడు.. ఆయన ముంగిట కళ్ళాపి చల్లాలని. మబ్బులన్నీ క్యూలు కట్టి తిరుమలలో వేచి చూస్తున్నాయి.. ఆ లక్ష్మీపతిని దర్శించుకుందామని. గోవిందా.. గోవిందా అంటూ భక్తులు స్వరాలు పిక్కటిల్లుతుంటే.. సప్తగిరులు తన్మయంతో ఊగిపోతున్నాయి. ప్రకృతి అందాలన్నీ అక్కడనే తిష్టవేసి .. తిరుమలను సౌకుమార్యంగా తీర్చిదిద్దుతున్నాయి. వేంకటనాధుడు కొలువైన కొండకు చందన గంధాలను అద్దుతున్నాయి. ఎక్కడ చూసినా తనివి తీరని సోయగం. ఏమూల గాంచినా .. అబ్బుర పరిచే అందం. ఏ వర్ణనలకూ అందని అందాలన్నీ తిరుమలలోనే కొలువయ్యాయి.

దైవ దర్శనం కోసం కొండపైకి వచ్చే భక్తులపై పన్నీరు చల్లి, స్వాగతం పలుకుతున్నట్లు తరులు వంగి సలామ్‌ చేస్తున్నాయి. కొండపై నుండి కిందికి చూస్తే .. అసలు తిరుమలపై ఉన్నమా లేక క్షీర సాగర మధ్యమంలో ఉన్నామా అన్న అనుభూతి. ఎప్పడూ చూడని ఆ అందాలను చూస్తున్నామా అన్న భావన. కొండపైకి వెళ్ళే .. అన్ని మార్గాల్లో .. కనువిందు చేస్తున్నసుందర దృశ్యాలను చూసి భక్తులు మధురాను భూతి చెందుతుంటారు. చిన్నగా కదులుతున్న వాహన శ్రేణికి అడుగడుగునా ఎదురవుతున్న వన్య ప్రాణులు సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుంది. ఆ వాతావరణంలో కొండపైకి వెళ్ళడం అంటే ఓదివ్యానుభూతే. వెళ్ళిన వారు.. వెళుతున్న వారు ఆనందాను భూతితో ఆ పరంధాముని చెంతకు చేరుతున్నామన్న సంతోషం. వారి బాగోగులను చూసే అధికారులు .. నమో వేంకటేశ అంటూ అడుగడుగునా జాగ్రత్తలు చెబుతుంటారు. భక్తుల జాగ్రత్తలను పరికిస్తుంటారు.

ప్రకృతి అంటే.. శక్తి స్వరూపం. ఆ శక్తికి కోపం వస్తే ముల్లోకాలు మునిగి పోతాయి. ఆ తల్లి కరుణిస్తే లోకాలన్నీ సుభిక్షమవుతాయి. ఓచోట భీకరంగా వర్షిస్తూ.. మరోచోట పులకితమై కనిపిస్తోంది. అలాంటి శక్తిప్రద తిరుమలలో కొలువైందా అన్నట్లుంది. అటు వేంకటేశుని దర్శనం.. ఇటు ప్రకృతికాంత పులకిత వదనాన్ని తిలకించి భక్తులు పరమానంద భరితులవుతుంటారు. పరమోత్కృష్టమైన
ఆ రూపాన్ని వీక్షించి .. పరవశులవుతుంటారు. పైగా బ్రహ్మోత్సవ సమయం. వైకుంఠనాధుని వైభోగాన్ని చూసి తరించాలని తపించే.. భక్తులతో తిరుమల గిరులు రద్దీగా మారాయి. రోజుకొక్క వైభవంతో.. పూటకొక్క వాహనంపై ఊరేగుతూ ఆ శ్రీనివాసుడు నాలుగు మాడల వీధుల్లో తన సోయగాన్ని ప్రదర్శిస్తున్నాడు. గోవింద నామాల మధ్య తన్మయుడవుతున్నాడు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10