శాసనసభలో మంత్రి హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్: ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలపై వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్‌పై శాసన సభలో చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ‘కవి’లు అయ్యారని వ్యంగ్యంగా అన్నారు. క అంటే కనబడదని., వి అంటే వినబడదని అన్నారు. తెలంగాణ సాధిస్తున్న ప్రగతిని చూసి నీతి ఆయోగ్ ప్రశంసిస్తున్నా.. ప్రతిపక్ష నేతలకు కనబడటం లేదని.., వినబడటం లేదని మండిపడ్డారు. విపక్ష పార్టీలకు చెందిన నేతలు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని అప్పుడే తాము చేస్తున్న అభివృద్ధి కనిపిస్తుందని దుయ్యబట్టారు.
ఈటల రాజేందర్ నిండుపున్నమిలో వెన్నెల వెలుగులు చూడకుండా చందమామలో మచ్చలు చూస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు ఏమీ చేయొద్దన్నట్టుగా విపక్ష నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో బడ్జెట్ సమావేశాలప్పుడు నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవారని, విద్యుత్ కోతలను నిరసిస్తూ తరచూ నిరసన ప్రదర్శనలు జరిగేవన్నారు. గతంలో ఎంఎల్‌ఎలు నియోజకవర్గాల్లో పర్యటించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పండిరదన్నారు. బిందెడు నీటి కోసం మహిళలు మైళ్ల దూరం నడిచేవారని, నల్లగొండ జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ నీటి వల్ల ఎముకలు వంకర్లు పోయిబాధపడేవారని, ప్రజల గుండె మీద ఫ్లోరైడ్ బండలు తొలగించిందెవరని హరీశ్‌రావు ప్రశ్నించారు.
బీజేపీ పార్టీకి.. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం ఒక్కటే తెలుసునని హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలకు దేవుడి పేరు పెట్టారన్నారు. బ్యారేజీలకు కూడా దేవుళ్ల పేర్లుపెట్టారు. దేవుడి పట్ల ఎంత భక్తి విశ్వాశాలు ఉన్నప్పటికీ మేం ఎప్పుడూ మతాల పేరుతో రెచ్చగొట్టలేదన్నారు.