AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పట్టాలు తప్పినా.. పట్టుతప్పని బోగీలు

ఆధునిక బోగీలతో గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు క్షేమం
ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు

హైదరాబాద్‌: రైలు పట్టాలు తప్పినా.. బోగీలు కిలోమీటరు మేర దూసుకెళ్లినా.. కాంక్రీట్‌ స్లీపర్స్‌ ముక్కలైనా.. విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయినా.. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు కారణం ఆధునిక బోగీలే.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..

బీబీనగర్‌-ఘట్‌కేసగర్‌ స్టేషన్ల మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఎస్‌1 నుంచి ఎస్‌4, జనరల్‌, లగేజీ బోగీలు పట్టాలు తప్పాయి. అంతేకాదు కిలోమీటర్‌ వరకు బోగీలను ఈడ్చుకుంటూ ముందుకు వెళ్లాయి. కాంక్రీట్‌ స్లీపర్స్‌ ముక్కలు ముక్కలయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు ఒరిగిపోయాయి. ఇంత జరిగినా.. ఒక్క కోచ్‌ కూడా బోల్తాపడలేదు. పట్టాలు తప్పినా అలాగే నిలబడిపోయాయి. అలా జరగడం వల్లే.. పెను ముప్పు తప్పింది. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో (లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌) కోచ్‌లు ఉండడం వల్లే.. ప్రమాద తీవ్రత తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కాకుండా.. సాధారణ కోచ్‌లు ఉంటే.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక కోచ్‌లోకి మరో కోచ్‌లు దూసుకెళ్తాయి. ఒకదానిపైకి మరొకటి ఎక్కుతుంటాయి. కానీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పట్టాలు తప్పిన బోగీలను అక్కడే వదిలిపెట్టి..మిగతా బోగీలను యథావిధిగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు పంపించారు. ఈ ఘటనతో ఆ రూట్‌లో రైల్వే ట్రాక్‌ ధ్వంసమైంది. ప్రస్తుతం ట్రాక్‌ మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీబీనగర్‌ నుంచి సికింద్రాబాద్‌ రూట్లో రాకపోకలు సాగించే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఎల్‌హెచ్‌బీ(లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌) .. అనేది జర్మన్‌ టెక్నాలజీ. జర్మనీ నుంచి ఈ బోగీలు 2000 సంవత్సరంలో వచ్చాయి. మొదట విదేశాల్లో తయారైన బోగీలను మనదేశంలోకి తీసుకొచ్చే వారు. కానీ ఇప్పుడు పంజాబ్‌లోని కపుర్తలాలో భారతీయ రైల్వే సంస్థ తయారు చేస్తోంది. ఇవి ఇనుముతో తయారు చేసిన బోగీలు. బరువు తక్కువగా ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ బోగీలను గరిష్టంగా 140-160 కిమీ వేగంతో ప్రయాణం చేసేలా తీర్చిదిద్దారు. ఇందులో డిస్క్‌ బ్రేక్స్‌ ఉంటాయి. లోకో పైలట్‌ బ్రేక్‌ అప్లై చేసినప్పుడు.. ఎక్కుడున్న బోగీ అక్కడే ఆగిపోతుంది. అంతేకాదు ఎప్పుడైనా పట్టాలు తప్పినప్పుడు… రైళ్ల చక్రాలు పట్టాల నుంచి బయటకు రావు. రెండు పట్టాల మధ్యే ఉండిపోతాయి. అలాంటి అధునాతన టెక్నాలజీ ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల్లో ఉంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10