వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల
హైదరాబాద్: తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ఆరోపించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై తో షర్మిల భేటీ అయి ర్యాగింగ్ అంశంపై చర్చించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలో వాస్తవ పరిస్థితులను వివరించేందుకే గవర్నర్‌ను కలిశా. కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారు. దేశంలో భారత రాజ్యాంగం అమలులో ఉంటే తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతుంది. తెలంగాణలో ప్రతిపక్షాలకు స్థానం లేదు. ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. బీఆర్‌ఎస్ నేతలు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీలో గూండాలు మాత్రమే ఉన్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరా. వీధి కుక్కలు దాడి చేసి పసి ప్రాణాలు తీస్తే పట్టించుకునే దిక్కులేదు. తెలంగాణలో అన్ని వర్గాలను కేసీఆర్ మోసం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగాలను కేసీఆర్ గుప్పిట్లో పెట్టుకున్నారు. ప్రజల పక్షాన నేను నిలబడితే ఇష్టం వచ్చినట్లు నన్ను తిట్టారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇబ్బందులు పెడుతున్నారు. తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం వైఎస్‌ఆర్‌టీపీకి, ప్రతిపక్షాలకు లేదు. అందుకే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరుతున్నాం. ఇదే విషయంపై త్వరలో రాష్ట్రపతిని కలిసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం.’’ అని షర్మిల చెప్పుకొచ్చారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం… నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని షర్మిల పరామర్శించనున్నారు.