తారకరత్న భౌతికదేహాన్ని చూసి భోరున విలపించిన తల్లి
తారకరత్న భౌతికకాయాన్ని చూసి కన్న తల్లి తల్లడిల్లింది.. తల్లిని వచ్చాను ఒక్కసారి కళ్లు తెరిచి చూడు నాన్న అంటూ రోదించింది. అభిమానుల సందర్శనార్థం ఇంటి నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించారు. నందమూరి అభిమానులు తారకరత్న కడసారి చూపు కోసం భారీగా తరలివచ్చారు. తారకరత్న తల్లిదండ్రులు కూడా కొడుకును చివరి చూపు చూసేందుకు చాంబర్‌కు వెళ్లారు. ఆ సమయంలో హృదయవిదారక దృశ్యం అక్కడ ఉన్నవారందరినీ కలచివేసింది. తారకరత్న తల్లి కొడుకును ఆ స్థితిలో చూసి గుండెలవిసేలా రోదించింది. కన్న కొడుకు ఇక లేడని ఆమె విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
కొడుకు ప్రేమ వివాహం విషయంలో విభేదించినా నవ మోసాలు మోసి, కనిపెంచిన కొడుకు నిర్జీవంగా ఉంటే ఇంకెందుకొచ్చిన పంతాలని తారకరత్న తల్లి నిర్ణయించుకున్నారు. పేగు తెంచుకుని పుట్టిన కొడుకు కడసారి చూపు కోసం ఫిలిం చాంబర్‌కు కదిలారు.
తారకరత్న భౌతికకాయాన్ని చూసేందుకు ఆదివారం నాడు ఆయన తల్లి తారకరత్న స్వగృహానికి వెళ్లలేదనే ప్రచారం జరిగింది. చెట్టంత కొడుకే పోయాక ఎందుకీ పంతాలూపట్టింపులు అని తారకరత్న తల్లి భావించారు. కొడుకు భౌతికకాయాన్ని చూసి ఆమె రోదించిన తీరు టీవీల్లో, సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చూసిన వారి మనసుల్ని కూడా తొలిచేసింది. కన్న తల్లిదండ్రులకు, సర్వస్వం అతనే అనుకుని నమ్మి వెంట నడిచిన భార్యకు దేవుడు అన్యాయం చేశాడు.
నాన్న మళ్లీ వచ్చి తమతో ఆడుకుంటాడని ఆశించిన ఆ పసివాళ్ల ముఖం చూసి కూడా ఆ పైవాడికి జాలి కలగలేదు. తండ్రి కోలుకోవాలని, కోలుకుంటాడని తల్లిని ఓదార్చి.. లోలోపల కుమిలిపోయిన ఆ పెద్ద కూతురి వేదనకు కూడా ఆ భగవంతుడి మనసు కరగలేదు. నందమూరి అభిమానులను, కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి నెట్టేసి తారకరత్న చివరి మజిలీకి పయనమయ్యాడు.