స్కై డైవ్ చేస్తూ కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకు ఉన్న అభిమానాన్ని ఓ ఎన్‌ఆర్‌ఐ వినూత్నంగా చాటుకున్నాడు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని స్కై డైవ్ చేస్తూ.. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. వృత్తి రీత్యా అమెరికాలో స్థిరపడ్డ సంతోష్ రాకొండ్ల.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీరాభిమాని. శుక్రవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. బీఆర్‌ఎస్ జెండాపై కేసీఆర్ ఫోటో ఉన్న పతాకాన్ని ఆకాశంలోకి తీసుకెళ్లాడు. స్కై డైవ్ చేస్తూ.. దాన్ని ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంతోష్ ప్రదర్శించిన గులాబీ రంగు జెండా మీద జై భారత్, జై కేసీఆర్ అని రాసి ఉంది. కింది భాగంలో హ్యాపీ బర్త్‌డే కేసీఆర్ అని రాశారు. మధ్యలో కేసీఆర్ చిత్రపటం, పెద్ద అక్షరాలతో బీఆర్‌ఎస్ అనే అక్షరాలు ఉన్నాయి. సంతోష్ ఈ జెండాను తీసుకుని జెట్‌లోకి వెళ్లాడు. అనంతరం ఆకాశం కొంత ఎత్తు నుంచి దూకుతూ.. ఆ జెండాను ఎగురవేశాడు. అనంతరం ప్యారాచూట్ సాయంతో క్షేమంగా నేల మీదకు చేరుకున్నాడు.
ధాన్యంతో కేసీఆర్ చిత్రపటం..
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను వనపర్తిలో వినూత్నంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశెనగ, ఉల్వలు, ఉప్పుతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో రైతు బాంధవుడు కేసీఆర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. రంగులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
2500 ఫొటోలతో సీఎం కేసీఆర్ ‘చిత్రం’
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ (ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ప్రముఖ నఖచిత్రకారుడు మహేశ్వరం నరహరి.. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా వినూత్న చిత్రం ఆవిష్కరించారు. 2500 చిత్రాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 100 సంక్షేమ పథకాలను ప్రతిబింబించే బొమ్మలతో కేసీఆర్ చిత్రాన్ని కుంచెతో రూపొందించారు.