ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు
బెంగళూరు: సినీ నటుడు, నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు తెలుస్తోంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు మరోసారి ఆయనకు బ్రెయిన్ స్కాన్ చేశారు. విదేశీ వైద్యుల బృందం ఆధ్వర్యంలో తారకరత్నకు ప్రత్యేక చికిత్స కొనసాగుతోంది. 22 రోజులుగా నారాయణ హృదయాలయలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. తారకరత్నను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తారకరత్న పరిస్థితి బాగా లేదని తెలిసి నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకున్నారు.
జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర లో తారకరత్న పాల్గొన్నారు. ఈ క్రమంలో లోకేష్‌తో పాదయాత్ర చేస్తూ తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హుటాహుటిన కుప్పంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్న కోలుకునేందుకు వైద్యులు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. విదేశీ వైద్యులను పిలిపించి మరీ తారకరత్నకు వైద్యం అందిస్తున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు.