తెలంగాణ సచివాలయం వద్ద బందోబస్తు నిర్వహించే సెక్యూరిటీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ప్రత్యేక పోలీసు విభాగం నుంచి టీజీ ఎస్పీఎఫ్‌కు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏక పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుళ్లు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీని ఇప్పటికే మార్చేసింది. ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులతో ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రత కల్పిస్తున్నది. ఇప్పుడు సచివాలయం బందోబస్తు విషయంలోనూ ప్రత్యేక పోలీసు విభాగం నుంచి టీజీఎస్పీఎఫ్‌కు బాధ్యతలను బదిలీ చేసింది.
కాగా, గతంలో ఎస్‌పీఎఫ్ పర్యవేక్షణలోనే సచివాలయ బందోబస్తు కొనసాగింది. కానీ కొత్త సచివాలయం నిర్మాణం తర్వాత స్పెషల్ పోలీసులకు బాధ్యత అప్పగించారు. ఇప్పుడు బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళన నేపథ్యంలో తిరిగి ఎస్‌పీఎఫ్‌కు సెక్యూరిటీ బందోబస్తు బాధ్యతను అప్పగించారు.