AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేపు కవితను విచారించనున్న ఈడీ

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కొత్త ట్విస్ట్‌..

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రేపు ఎమ్మెల్సీ కవిత విచారణ జరగాల్సి ఉంది. అయితే నేడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై ఊహించని ట్విస్ట్‌ ఇచ్చారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ కేసులో ఇప్పటికే అరుణ్‌ రామచంద్ర పిళ్లై అరెస్ట్‌ అయ్యారు. ఆయన నేడు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో దరఖాస్తు చేశారు. పిళ్లై దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు.. ఈడీకి నోటీసులు పంపించింది.

రేపు రామచంద్ర పిళ్లై వాంగ్మూలం ఆధారంగానే కవితను విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. నిజానికి 9వ తేదీనే ఆమెను విచారించాల్సి ఉంది. అయితే ఆమె ముందుగానే ఖరారైన షెడ్యూల్‌ కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నానని.. 11న విచారణకు హాజరవుతానని ఈడీకి తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్‌ రామచంద్ర పిళ్లై ట్విస్ట్‌ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పిళ్లై తన వాంగ్మూలంలో తను కవిత బినామీనని చెప్పారు. అలాగే ఆమె చెప్పినందునే తన ఖాతాలోకి రూ.32 కోట్లు వచ్చాయని ఈడీకి తెలిపారు. అలాగే ఒక కోటి రూపాయలు సైతం ఆయన సొంత అకౌంట్‌లో పడ్డాయని తెలిపారు.

అలాగే లిక్కర్‌ స్కాంలో సౌంత్‌ గ్రూప్‌నకు 32.5 శాతం వాటాలున్నాయి. వీటిలో సైతం కవితకు వాటాలందాయని ఈడీ చెబుతోంది. వచ్చిన లాభాల్లో కవిత, పిళ్లై అకౌంట్లకు వెళ్లినట్టు డిజిటల్‌ ఆధారాలు ఈడీ వద్ద ఉన్నాయి. సెల్‌ ఫోన్‌ సహా ఇతర ఆధారాలన్నీ ఈడీ వద్ద ఉన్నాయి. ఏది ఏమైనా రేపు కవితను అరుణ్‌ రామచంద్ర పిళ్లై సమక్షంలోనే విచారించనున్నారు. కాబట్టి అవన్నీ తాను చెప్పలేదని.. ఆ మేరకే కోర్టులో పిటిషన్‌ కూడా వేసే అవకాశం ఉందని రామచంద్ర పిళ్లై చెప్పే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10