ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇవ్వగా.. వాటిపై స్పందిస్తూ విచారణకు హాజరు కాలేనని చెప్పటం.. వెంటనే ఢిల్లీకి పయనమవ్వటం.. సర్వత్రా ఉత్కంఠకు తెరతీసింది. అయితే.. ఈ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీకి కవిత మరో లేఖ రాసింది. 11న విచారణకు హాజరవుతా అంటూ.. కవిత లెటర్ రాసింది. గతంలో ఆయా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడీ కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని కవిత ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు విచారణ నేపథ్యంలో తనకు జారీ అయిన నోటీసులపై మరోసారి ఈడీకి లేఖ రాసారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాగా.. ముందు ఈ నెల 15న విచారణకు వెళ్తారని కవిత వర్గీయులు తెలపగా.. ఇప్పుడు రాసిన లేఖలో ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ముందస్తు అపాయింట్‌మెంట్లు, కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేమని తేల్చి చెప్పారు. అయితే.. హడావిడిగా దర్యాప్తు చేయడం ఏంటని ఈడీని కవిత నిలదీశారు. ఇంత స్వల్ప కాలంలో విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడం ఏంటో అర్థం కావడం లేదని లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు పేరిట రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేది ఏమీ లేదని తెలిపారు.