ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరు నాగారంలో మావోయిస్టుల పేరిట విడుదలైన లేఖ కలకలం రేపుతోంది. మావోయిస్టు యాక్షన్ టీం బద్రు, కామ్రేడ్ వెంకటేష్ పేరుతో హెచ్చరిక లేఖను విడుదల చేశారు. వాల్ పోస్టర్లలో పలువురు బీఆర్ఎస్ నేతల పేర్లు వెల్లడిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఏటూరు నాగారం బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న మహమ్మద్ ఖాజా పాషా, పార్టీకి చెందిన కునూరు మహేశ్, చిప్ప అశోక్ పేర్లను లేఖలో పేర్కొన్నారు. ఇసుక దోపిడీ, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని.., ప్రజా వ్యతిరేక పద్ధతులు మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజల సమక్షంలో ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.
ఫారెస్ట్ అధికారులు, పోలీసులను కూడా లేఖలో హెచ్చరించారు. ఫారెస్ట్ అధికారులు ప్రజలపై కేసులు పెట్టి వారిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. పోలీసుల కన్నా.. ఫారెస్ట్ అధికారులు ఎక్కువ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు పద్ధతి మార్చుకుంటే మంచిదని లేఖలో హెచ్చరించారు. పోలీస్ ఇన్ఫార్మర్లు కూడా పద్ధతి మార్చుకోవాలన్నారు. అటవీ ప్రాంతంలో పోలీసుల కూలింగ్ ఆపకపోతే బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడి నుండి జిల్లా స్థాయి నాయకుల వరకు ఎవర్ని వదలబోమని హెచ్చరించారు. మావోయిస్టుల లేఖతో ఏటూరు నాగారం ప్రాతంతంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులలో అలజడి మొదలైంది. ఎప్పుడు ఏం జరనుందోనని నేతలు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.