తెలంగాణ ఉద్యమ నేత,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చకిలం అనిల్ రాజీనామా
నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లెటర్ ని అధిష్టానానికి పంపించారు అనిల్ కుమార్. అనంతరం నల్గొండలో ఆయన మీడియతో మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుంచి తనను నమ్ముకుని ఉన్నందుకు.. కేసీఆర్ నట్టేట ముంచాడని అనిల్ కుమార్ భావోద్వేగానికి గురైయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని కాపాడానని, కానీ తగిన ప్రాధాన్యత దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2014 ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి క్యాన్సల్ చేశారని, 2018లో టీడీపీ నుండి వచ్చిన కంచర్ల భూపాల్ రెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డ వాళ్లందరూ.. నేడు బీఆర్ఎస్ లో పెత్తనం చెలాయిస్తుంటే నిజమైన ఉద్యమకారులు ఏమై పోవాలని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు వెళ్లిన వారికి పార్టీలో గౌరవం లేదని వాపోయారు. ముఖ్య నేతలు, అనుచరులతో చర్చించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. అవసరమైతే నల్గొండ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.