పిల్లలు, పెద్దలు సరదాగా ఈతకోసమని కాలువలు, చెరువులకి వెళ్తుంటారు. కొన్నిసార్లు ఈత రాని వాళ్లు లోతులోకి వెళ్లిపోవడంతో మునిగిపోయి గల్లంతైన ఘటనలు కూడా చాలానే జరిగాయి. ఇప్పడు తాజాగా ఓ పదేళ్ల బాలుడు మనిగిపోతున్న తన స్నేహితులను కాపాడి అందిరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గోవా రాజధాని పణాజీ నుంచి 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న కుంబార్జువాడలో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఉత్సవాల సందర్భంగా నలుగురు స్నేహితులు అక్కడికి వెళ్లారు. రంగులు చల్లుకొని కాసేపు అక్కడ ఆనందంగా ఆడుకున్నారు. మొత్తం రంగులతో తడిసిపోయిన ఆ పిల్లలు శుభ్రం చేసుకునేందుకని దగ్గర్లో ఉన్న ఓ నది వద్దకు వెళ్లారు.
వారిలో ముగ్గురు పిల్లలు ప్రమాదవశాత్తు జారీ నీటిలో పడిపోయారు. అసలే వారికి ఈత కూడా రాకపోవడంతో ప్రాణభయంతో కేకలు వేశారు. స్నేహితులను గమనించిన సంజయ్ అనే పదేళ్ల బాలుడు వెంటనే నీటిలోకి దూకాడు. ఒకరి తర్వాత మరొకరిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. అక్కడున్న స్థానికుల సమాచారంతో అంబులెన్సుకు ఫోన్ చేశాడు. చివరికి సీపీఆర్ చేయడంతో ఆ ముగ్గురు తేరుకున్నారు. మిత్రులు మునిగిపోతుంటే ధైర్యంగా నీటిలో దూకి ప్రాణాలు కాపాడిన బాలుడు సంజయ్ ను అందరూ అభినందించారు. సంజయ్ పేరు గోవా అంతటా వ్యాపించింది. శుక్రవారం రోజున ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఆ బాలుడ్ని పిలిపించి రూ. లక్ష నగదు అందజేశారు.