ఐపీఎల్ (IPL 2023)లో తన ప్రస్థానాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ స్వంత మైదానం నుంచి మొదలు పెట్టబోతోంది. ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొనబోతోంది. గతేడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్ పేలవ ప్రదర్శన చేసింది. మొత్తం 14 మ్యాచ్‌ల్లో కేవలం 6 మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన చేయాలని ఆశపడుతోంది.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ ఐదెన్ మార్‌క్రమ్ సారథ్యంలో హైదరాబాద్ బరిలోకి దిగబోతోంది. అయితే తొలి రెండు మ్యాచ్‌లకు ఐదెన్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాదీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం పిచ్ ఫ్లాట్ వికెట్. ఈ పిచ్‌పై పూర్తిగా బ్యాట్స్‌మెన్‌దే హవా అని చెప్పవచ్చు. పాత బంతితో స్లో బౌలర్స్, స్పిన్నర్లను ఆడడం కొంత కష్టమవుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుంది. ఈ పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేయడం కంటే ఛేజింగ్ చేయడం సులభం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఈ రోజు అంతా వేడిగా ఉండనుంది. వర్ష సూచనలు కనిపించడం లేదు.