అగ్రరాజ్యం అమెరికాను టోర్నడోల విధ్వంసం కొనసాగుతోంది. శక్తివంతమైన గాలులతో దక్షిణ-మధ్య, తూర్పు అమెరికాలో మరణించిన వారి సంఖ్య 21కి పెరిగిందని, డజన్ల కొద్దీ గాయపడ్డారని అధికారులు శనివారం వెల్లడించారు. గతవారం మిసిసిపి ( Mississippi), అలబామా (Alabama) గ్రామీణ ప్రాంతాల్లో టోర్నడో సృష్టించిన బీభత్సానికి కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నుంచి సంభవించిన తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాలలో ఒకటైన టెన్నెస్సీలో ఏడుగురు చనిపోయారని అత్యవసర నిర్వహణ సంస్థ ప్రతినిధి ధ్రువీకరించారు.
దక్షిణాన అర్కాన్సాస్, మిసిసిపి,అలబామా, మిడ్‌వెస్ట్‌లోని ఇండియానా, ఇల్లినాయిస్‌లలో 14 మరణాలు నమోదయ్యాయి. తూర్పు తీరంలో తుఫాను కారణంగా ఆదివారం వరకూ ఉరుములు, వడగళ్లు, శక్తివంతమైన గాలులు వీస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. శుక్రవారం శక్తివంతమైన గాలులతో అసాధారణ పరిస్థితి తలెత్తింది. రాజధాని లిటిల్ రాక్‌తో సహా అర్కాన్సాస్‌పై విరుచుకుపడిన భీకర గాలులకు కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర గవర్నర్ సారా హుకాబీ చెప్పారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి, కార్లు కొట్టుకుపోయి, విద్యుత్ లైన్లు తెగిపడి, చెట్లు నేలకూలాయి. దీంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీని ప్రకటించిన గవర్నర్.. సహాయక చర్యలకు నేషనల్ గార్డ్స్ సాయం కోరారు.
చికాగో వెలుపల, ఇల్లినాయిస్ పట్టణంలోని బెల్విడెరేలో విపత్తు సంభవించింది. అపోలో థియేటర్‌లో కచేరీ జరుగుతుండగా పెను గాలులు వీచి పైకప్పు సహా ముందు భాగం కూలిపోయింది. ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 28 మంది గాయపడగా.. తీవ్ర గాయాలతో ఐదుగురు ఆస్పత్రిలో చేరారు. దక్షిణ ఇల్లినాయిస్‌లోని క్రాఫోర్డ్ కౌంటీలో ఇల్లు కూలి ముగ్గురు చనిపోయారు. పక్కనే ఉన్న ఇండియానా రాష్ట్రంలోనూ టోర్నడో ముగ్గుర్ని బలితీసుకుంది. టోర్నోడోల విధ్వంసానికి విద్యుత్ వ్యవస్థ దెబ్బతిని, లక్షలాది ఇళ్లు చీకట్లలోనే ఉన్నాయి.