3D టెక్నాలజీతో బ్రిడ్జ్ తయారీ
ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad) సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ సహకారంతో భారతదేశపు మొట్టమొదటి ప్రోటోటైప్ 3డి ప్రింటెడ్ బ్రిడ్జ్‌ను అభివృద్ధి చేసింది. దీన్ని ఐఐటీ హైదరాబాద్ సివిల్ ఇంజనీరింగ్ విభాగ ప్రొఫెసర్ కె.వి.ఎల్. సుబ్రమణ్యం, పరిశోధన బృందం కలిసి రూపకల్పన చేశారు. 3డి కాంక్రీట్ ప్రింటింగ్ సొల్యూషన్స్ అందించడంలో ప్రత్యేకత కలిగిన స్టార్టప్ కంపెనీ సింప్లిఫోర్జ్ ఈ బ్రిడ్జ్ ను ముద్రించింది.
పాదాచారులు కోసం రూపొందించిన ఈ బ్రిడ్జి లోడ్ టెస్టింగ్ దశలో ఉంది. కాంక్రీటు, ఉపబల వినియోగాన్ని తగ్గించడానికి ఫారమ్ ఆప్టిమైజేషన్‌ను అనుసరించి ఐఐటీ హైదరాబాద్‌లో ఈ వంతెనను తయారు చేశారు. ‘మెటీరియల్ ఫాలోస్ ఫోర్స్’ అనే పద్దతిని ఉపయోగించి ఈ వంతెనను రూపొందించారు.
బ్రిడ్జ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ వాడకం ఊపందుకొంటుందని చెప్పారు. తక్కువ వ్యవధిలో నిర్మాణాలను పూర్తి చేయగల సామర్థ్యం 3డీ కాంక్రీట్ టెక్నాలజీకి ఉందని తెలిపారు. నిర్మాణ రంగంలో ఈ టెక్నాలజీ అనూహ్య మార్పులు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.