తెలంగాణ ఆత్మగౌరవం అంటే కవిత మాత్రమే కాదు:డీకే అరుణ
లిక్కర్ స్కాంలో కేవలం కవితకు మాత్రమే నోటీసులివ్వలేదని, మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరికీ నోటీసులిచ్చారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులివ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న విమర్శలకు ఆమె స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కల్వకుంట్ల కుటుంబంలో ఎవరిపై ఆరోపణ వచ్చినా.. అది మొత్తం తెలంగాణ సమాజంపై వచ్చినట్లు చిత్రీకరించడం సబబు కాదని తెలిపారు. కవితకు నోటీసులు వస్తాయని ముందే తెలుసని, కావాలనే మహిళా చట్టంపై ధర్నా అని కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటాయని, ఈడీ నోటీసులకు బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. దీనిని కక్షసాధింపు అంటూ బీఆర్ఎస్ రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు. మహిళలపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉందని.. ఈడీ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.