రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి సంపూర్ణ ఆరోగ్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సంకల్పించారని, ఇందులో భాగంగా మహిళా జర్నలిస్టులకు (Female Journalists) కూడా ఉచిత ఆరోగ్య పరీక్షలు (Free medical camps) నిర్వహించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (CS Shanti Kumari) అన్నారు. నేటి నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశిబిరాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జిల్లా కేంద్రాల్లో కూడా మహిళా జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్యపరీక్షలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోని సమాచార కమిషనర్
కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని సీఎస్ శాంతి కుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్‌లో భాగంగా 36 పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉచిత ఆరోగ్యపరీక్షల ఫలితంగా మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక భారం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
గురువారం నుంచి నుండి ఏప్రిల్ 9 వరకు అంటే పది రోజుల పాటు వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో పనిచేస్తున్న గుర్తింపు పొందిన మహిళా జర్నలిస్టులకు ఆయా జిల్లా కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.